Delhi: గిగ్ వర్కర్లకు కనీస వేతనం, ఆరోగ్య భద్రత.. ఏప్రిల్ 1 నుంచి అమలు

Delhi: దేశంలోని కార్మిక రంగంలో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాలుగు కొత్త కార్మిక చట్టాలకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ చట్టాల ద్వారా తొలిసారిగా గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లకు కూడా ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించనున్నారు.

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు వంటి గిగ్ వర్కర్లకు కనీస వేతనం, ఆరోగ్యం, వృత్తి భద్రత వంటి ప్రయోజనాలు అందనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ కొత్త చట్టాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ముసాయిదా నిబంధనల ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకే అగ్రిగేటర్‌తో కనీసం 90 రోజులు పనిచేసిన గిగ్ వర్కర్లు సామాజిక భద్రత పథకాలకు అర్హులు అవుతారు. ఒకటి కంటే ఎక్కువ సంస్థలతో పనిచేసేవారికి ఈ పరిమితిని 120 రోజులుగా నిర్ణయించారు. ఒకే రోజులో వేర్వేరు సంస్థల కోసం పనిచేసినప్పుడు, ప్రతి పనిదినాన్ని విడిగా లెక్కిస్తారు.

ఇకపై అన్ని రంగాల ఉద్యోగులకు నియామక పత్రాలు (అపాయింట్‌మెంట్ లెటర్లు) ఇవ్వడం తప్పనిసరి కానుంది. అలాగే కనీస వేతనం అన్ని రంగాల కార్మికులకు చట్టబద్ధంగా వర్తిస్తుంది.

గిగ్ వర్కర్లు సమ్మెకు దిగే నేపథ్యంలో, డిసెంబర్ 30న ముసాయిదా నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ ముసాయిదాపై భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను కేంద్రం స్వీకరిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *