Delhi: ఢిల్లీ గాలిలో ప్రమాదకర బ్యాక్టీరియా..

Delhi: ఢిల్లీ గాలిలో మానవ ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం కలిగించే బ్యాక్టీరియా ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. యాంటీ బయాటిక్స్‌కు కూడా లొంగని సూపర్‌బగ్ నగర గాలిలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నట్టు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) శాస్త్రవేత్తలు గుర్తించారు.

జేఎన్‌యూ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో, ముఖ్యంగా ఢిల్లీలోని మురికివాడలు, అధిక జనసాంద్రత ఉన్న రద్దీ ప్రాంతాల్లో ఈ బ్యాక్టీరియా తీవ్రంగా ఉన్నట్టు వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన పరిమితులతో పోలిస్తే, గాలిలోని బ్యాక్టీరియా స్థాయి 16 రెట్లు అధికంగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది.

ఈ సూపర్‌బగ్‌ యాంటీ బయాటిక్స్‌కు ప్రతిఘటన చూపడంతో చికిత్స మరింత క్లిష్టంగా మారుతున్నట్టు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇది న్యుమోనియా, రక్త సంక్రమణలు (బ్లడ్ ఇన్‌ఫెక్షన్లు) వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది.

వాతావరణ కాలుష్యం, మురుగు నీటి సమస్యలు, పారిశుధ్య లోపాలు, జనసాంద్రత ఎక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల ఈ బ్యాక్టీరియా గాలిలో వ్యాపిస్తోందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. దీని ప్రభావం చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ స్థాయిలో గాలిలోని సూక్ష్మజీవులపై మరింత పరిశోధన చేసి తగిన నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *