Delhi Airport: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు (IGIA)లో శుక్రవారం (నవంబర్ 07) ఉదయం భారీ గందరగోళం నెలకొంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా వందకు పైగా విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి, దీంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
సమస్యకు కారణం ఏమిటి?
ఎయిర్ పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, విమానాల రాకపోకలకు సంబంధించి ఆటోమేటిక్ ట్రాకింగ్ సిస్టమ్ (ATS) లో సమస్య ఏర్పడింది.
ఆటోమేటిక్ ట్రాకింగ్ సిస్టమ్ (ATS) సరిగ్గా పనిచేయకపోవడంతో విమాన షెడ్యూలింగ్ ప్రక్రియ పూర్తిగా దెబ్బతింది. ATS కు కమ్యూనికేషన్ అందించే ఆటోమేటిక్ మెస్సేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ (AMSS) లో గురువారం (నవంబర్ 06) రాత్రి సాంకేతిక సమస్య తలెత్తినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
మ్యానువల్ షెడ్యూలింగ్‌తో ఆలస్యం
సాధారణంగా ఆటోమేటిక్‌గా జరిగే విమానాల ప్రణాళిక, ప్రస్తుతం ఏటీసీ సిబ్బంది ద్వారా మ్యానువల్‌గా నిర్వహించబడుతోంది. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా సిబ్బంది ఒక్కొక్క విమానాన్ని మ్యానువల్‌గా షెడ్యూల్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. 60 స్పెషల్ రైళ్లు!
మ్యానువల్ షెడ్యూలింగ్ కారణంగా విమానాల రాకపోకలు భారీగా ఆలస్యమవుతున్నాయి. ఒక్కో ఫ్లైట్ బయలుదేరడానికి కనీసం 45 నుంచి 50 నిమిషాలు పడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు మరికొన్ని గంటల సమయం పట్టవచ్చని వారు వెల్లడించారు.
ప్రయాణికుల ఇక్కట్లు, ఇతర విమానాశ్రయాలపై ప్రభావం
ఈ సాంకేతిక లోపం కారణంగా ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా తదితర ప్రముఖ విమానయాన సంస్థల సర్వీసులు నిలిచిపోయాయి. విమానాలు నిలిచిపోవడంతో ఎయిర్ పోర్టులోని చెక్-ఇన్, ఇతర కౌంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు, రద్దీ నెలకొంది. షెడ్యూల్ ఆలస్యం అవుతుండటంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
విమాన సర్వీసుల్లో అంతరాయంపై ఆయా ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేసి, అసౌకర్యానికి క్షమాపణలు కోరాయి. ఉదయం 8:30 తర్వాత ప్రయాణికులకు అధికారిక అడ్వైజరీ విడుదల చేయబడింది. ఢిల్లీ దేశంలో అత్యంత రద్దీ అయిన విమానాశ్రయం కావడం, ఇక్కడ రోజుకు 1500లకు పైగా విమానాలు రాకపోకలు సాగించడంతో, ఈ సమస్య ప్రభావం లక్నో, జైపూర్, చండీగఢ్, అమృత్‌సర్ వంటి ఇతర విమానాశ్రయాలలో ఉన్న ఫ్లైట్స్ రాకపోకలపై కూడా పడింది. ప్రయాణికులు తమ ఫ్లైట్స్ తాజా వివరాల కోసం flightrader24 వంటి వెబ్‌సైట్‌లను చూడాల్సిందిగా అధికారులు సూచించారు.

