Venezuela: వెనెజువెలా దేశంలో మారుతున్న రాజకీయ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికా వైమానిక దళాలు సుమారు 150 యుద్ధ విమానాలతో నిర్వహించిన మెరుపు దాడి అనంతరం, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరస్‌లను అమెరికా ప్రత్యేక దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ భారీ సైనిక చర్యలో 40 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. అధ్యక్షుడు ప్రస్తుతం అమెరికా రక్షణ విభాగం ఆధీనంలో ఉన్నారని, వారిని న్యూయార్క్‌కు తరలించారని అమెరికా జనరల్ డాన్ కేన్ ధృవీకరించారు. మదురో దంపతులపై ‘నార్కో టెర్రరిజం’ (మాదకద్రవ్యాల ఉగ్రవాదం) అభియోగాల కింద బ్రూక్లిన్ జైలులో విచారణ జరిపి శిక్ష విధించనున్నట్లు తెలుస్తోంది.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశంలో పాలనాపరమైన ఆటంకాలు ఏర్పడకుండా ఉండేందుకు వెనెజువెలా సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ను దేశ తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 56 ఏళ్ల డెల్సీ రోడ్రిగ్జ్, మదురోకు అత్యంత సన్నిహితురాలు వృత్తిరీత్యా న్యాయవాది. 1969లో కారకాస్‌లో జన్మించిన ఈమె, విప్లవ నేత జార్జ్ ఆంటోనియో కుమార్తె. గత దశాబ్ద కాలంగా వెనెజువెలా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న డెల్సీ, ప్రస్తుతం ఆర్థిక, చమురు శాఖల బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. ఆమె 90 రోజుల పాటు ఈ పదవిలో కొనసాగుతారని దేశ రక్షణ మంత్రి పాడ్రినో సూచించినట్లు సమాచారం.
Also Read: AI Clinic In India: భారత్‌లో మొట్టమొదటి ప్రభుత్వ ఏఐ క్లినిక్ వచ్చేసింది
మరోవైపు, బాధ్యతలు చేపట్టిన వెంటనే డెల్సీ రోడ్రిగ్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మదురోనే దేశానికి చట్టబద్ధమైన నేత అని, ఆయనను వెంటనే విడిచిపెట్టాలని ఆమె అమెరికాను డిమాండ్ చేశారు. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆమె నియామకం పట్ల సానుకూలంగా స్పందించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో ఆమె జరిపిన చర్చల అనంతరం, వెనెజువెలా బాధ్యతలు ఆమెకు అప్పగించడమే ఆ దేశ ప్రజలకు శ్రేయస్కరమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. డెల్సీకి అమెరికాలోని వాల్‌స్ట్రీట్, రిపబ్లికన్ చమురు వ్యాపారులతో ఉన్న మంచి సంబంధాలు, దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
