Deceiver

Deceiver: ఇస్రోలో ఉద్యోగం అంటూ పెళ్లిళ్లు.. కోట్ల రూపాయల మోసం!

Deceiver: తాను ఇస్రోలో ఉద్యోగిని అని, 100 ఎకరాల ఆస్తికి వారసుడిని అని, అమ్మాయి నచ్చితే చాలు రూపాయి కట్నం వద్దంటూ పలువురు ఆడ పెళ్లి వాళ్ళను మోసం చేసి కోట్ల రూపాయలు కొట్టేసిన కేటుగాడి మోసాలకు ఏలూరు జిల్లా భీమడోలు సర్కిల్ పోలీసులు చెక్ పెట్టారు.. ఏలూరులోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ కేసు వివరాలను మీడియాకు వివరించారు.

నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం బంగారు పేటకు చెందిన ఆశం అనిల్ బాబు అనే వ్యక్తి తొమ్మిదవ తరగతి వరకు చదువుకున్నాడు. విలాస వంతమైన జీవితం కోసం మోసం చేసి బ్రతకాలని నిర్ణయించుకున్నాడు. ఒక ముఠాను ఏర్పాటు చేసుకుని మ్యాట్రిమోని వెబ్సైట్ లలో కళ్యాణ్ రెడ్డి గా పేరు మార్చుకుని తాను ఇస్రోలో ఉద్యోగం చేస్తున్నాను అని, 100 ఎకరాల ఆస్తి ఉందని, హైదరాబాద్, బెంగుళూరు లో విల్లాలు ఉన్నాయి అంటూ, అమ్మాయి నచ్చితే చాలు కట్నం ఒక్క రూపాయి అవసరం లేదంటూ ఆడ పెళ్లి వారిని నమ్మించేవాడు.

ఇందుకోసం అద్దె విల్లాలు, అద్దె మనుషులను సైతం సెటప్ చేసేవాడు. అతని మాటలను నమ్మిన ఆడ పెళ్లి వారిని వారి బంధువులకు ఇస్రోలో ఉద్యోగం ఇప్పిస్తాం అంటూ లక్షలు రూపాయల వసూలు చేసి మోసం చేసేవాడు. ఇదే విధంగా ఇప్పటి వరకు 4 పెళ్ళిళ్ళు చేసుకుని ఎంతో మందిని మోసం చేసి సుమారు కోటిన్నర రూపాయల కాజేసాడు.

ఇతని చేతిలో మోసపోయిన ఏలూరు జిల్లా గుండుగోలను కు చెందిన మహిళా ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన భీమడోలు పోలీసులు ఎట్టకేలకు కేటు గాడిని, అతని ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి కారు, రూ.2లక్షలు రూపాయల నగదు, 13సిమ్ కార్డులు, 5 మొబైల్ ఫోన్లు సహా నకిలీ అపాయింట్ మెంట్ ఆర్డరు కాపీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రతాప్ అభినందించారు…

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *