Mexico Train Accident: ఉత్తర అమెరికా దేశమైన మెక్సికోలో ఆదివారం ఒక భయంకరమైన రైలు ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ మెక్సికోలోని ఓక్సాకా రాష్ట్రంలో ప్రయాణికులతో వెళ్తున్న ‘ఇంటర్ ఓషియానిక్’ రైలు అదుపు తప్పి పట్టాలు పక్కకు పడిపోయింది. ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు 13 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, సుమారు 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పట్టాలు తప్పిన బోగీలు ఒకదానిపై ఒకటి పడిపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.
ప్రమాదం జరిగిన సమయంలో రైలులో మొత్తం 241 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది కలిపి సుమారు 250 మంది ఉన్నట్లు మెక్సికన్ నేవీ అధికారులు ధృవీకరించారు. నిజాండా అనే ప్రాంతం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే మెక్సికన్ ఆర్మీ, సివిల్ ప్రొటెక్షన్, నేవీ దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఈ సహాయక చర్యల ద్వారా 139 మందిని సురక్షితంగా కాపాడగలిగారు.
Also Read: Anakapalli: టాటానగర్–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం..
గాయపడిన 98 మందిలో 36 మంది ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్ పార్డో ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించడమే కాకుండా, మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఉన్నత స్థాయి బృందాలను ఘటనాస్థలికి పంపించారు.
ఓక్సాకా గవర్నర్ సాలోమన్ జారా క్రూజ్ ఈ ప్రమాదాన్ని ఈ ఏడాదిలో జరిగిన అత్యంత విషాదకర ఘటనగా అభివర్ణించారు. కాగా, పక్కాగా నిర్మించిన ట్రాక్‌పై వెళ్తున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై మెక్సికో అటార్నీ జనరల్ ఎర్నేస్టినా గోడోయ్ రామోస్ స్పందిస్తూ.. సాంకేతిక లోపమా లేక మరేదైనా కారణమా అన్న కోణంలో పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.
#BREAKING : At least 13 dead, 98 others injured after train derailment with 250 people onboard earlier today in southwest Mexico.#Mexico #TrainAccident #Accident #TrainDerailment pic.twitter.com/JsTQ7ON4gN
— upuknews (@upuknews1) December 29, 2025
