Dasoju sravan: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు, నదీజలాల పంపిణీ అంశం మరోసారి రాజకీయ చర్చలకు కేంద్రబిందువైంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ముఖ్యమంత్రి రేవంత్ కి సవాల్ విసిరారు. సాగునీటి సమస్యలపై మాజీ మంత్రి హరీశ్ రావుతో బహిరంగ చర్చకు రేవంత్ సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు.
శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన శ్రవణ్, సాగునీటి రంగంలోని సమస్యలు, నదీజలాల వినియోగంపై ప్రభుత్వ స్పష్టత లేదని విమర్శించారు. ఇటీవల ఎంపీల సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర అడిగిన ప్రశ్నలకు కూడా సీఎం సమాధానం ఇవ్వలేకపోయారని ఆరోపించారు. అలాంటిది ఉద్యమ నేత కేసీఆర్, అనుభవజ్ఞుడు హరీశ్ రావును ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించారు.
బనకచర్ల ప్రాజెక్టు ద్వారా బయటికీడుతున్న నీటిని ఆపాలని డిమాండ్ చేసిన శ్రవణ్, అవసరమైతే మాజీ సీఎం కేసీఆర్ సలహాలు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికే 18 నెలలు అవుతున్నప్పటికీ, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప ప్రజలకు ఉపయోగపడే ఏ పని చేయలేదని ఆరోపించారు.
గోదావరి నుంచి వెయ్యి టీఎంసీల నీరు చాలు అనే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అవాస్తవమని, రాష్ట్ర హక్కులపై పోరాటం చేసిన కేసీఆర్‌ను విమర్శించడం సమంజసం కాదని శ్రవణ్ అన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, విమర్శలను స్వీకరించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని సూచించారు.

