Dasoju sravan: జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో గుండె సంబంధిత సమస్యకు చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా మెరుగుపడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు.
మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై మీడియాతో మాట్లాడిన దాసోజు శ్రవణ్, గోపీనాథ్ చికిత్సకు సానుకూలంగా స్పందిస్తున్నారని చెప్పారు. వైద్యులు ఆయనను 48 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యంపై అధికారిక హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారు అని వివరించారు.
ఇటీవల బోరబండ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ మైనారిటీ విభాగ నాయకుడు మహ్మద్ సర్దార్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనతో మాగంటి గోపీనాథ్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని దాసోజు శ్రవణ్ తెలిపారు.
మాగంటి గోపీనాథ్ ఆసుపత్రిలో ఉన్నారని తెలిసిన వెంటనే మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్, ముఠా గోపాల్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సీనియర్ వైద్యుల బృందం ఆయనకు ఉత్తమ చికిత్స అందించుతోందని, త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుంటారని తమకు నమ్మకమున్నదని దాసోజు శ్రవణ్ ధీమా వ్యక్తం చేశారు.
