CM Chandrababu

CM Chandrababu: ఆటో డ్రైవర్లకు దసరా కానుక: రూ.15 వేలు ‘వాహనమిత్ర’ సాయం – సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్‌ సిక్స్‌ – సూపర్‌ హిట్‌’ బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి భారీ బహిరంగ సభ ఇది.

ఈ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చి, మాట నిలబెట్టుకుందని అన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూటమికి 95 శాతానికి పైగా స్ట్రైక్ రేట్ ఇచ్చి చారిత్రక తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. “తెలుగు తమ్ముళ్ల వేగం, జనసేన జోరు, కమలదళం ఉత్సాహానికి ఎదురులేదా?” అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

సూపర్ సిక్స్ పథకాల విజయగాథ
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సూపర్ సిక్స్’ పథకాలు భారీ విజయం సాధించాయని ముఖ్యమంత్రి తెలిపారు.

స్త్రీశక్తి: ఉచిత బస్సు ప్రయాణం పథకం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోందని, ఇప్పటి వరకు 5 కోట్ల మంది మహిళలు దీని ద్వారా లబ్ధి పొందారని అన్నారు.
తల్లికి వందనం: ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15,000 ఇస్తూ, తల్లుల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు.
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్: అన్నం పెట్టే రైతులకు అండగా నిలిచేందుకు ఈ పథకం ద్వారా 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని చెప్పారు.
దీపం-2: ఈ పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చి ప్రతి ఇంట్లో వెలుగులు నింపామని అన్నారు.
మెగా డీఎస్సీ: 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా యువతకు భవిష్యత్తుకు బాటలు వేశామని పేర్కొన్నారు.

Also Read: CM Chandrababu: వైసీపీకి అసెంబ్లీలో చర్చించే ధైర్యం ఉందా?: చంద్రబాబు నాయుడు

ఆటో డ్రైవర్లకు దసరా కానుక : 
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పారు. దసరా రోజు నుంచి వాహనమిత్ర పథకం ప్రారంభించి, ఒక్కో ఆటో డ్రైవర్‌కు రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఇది పేదలపై కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రేమకు నిదర్శనమని ఆయన అన్నారు.

ఈ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, మూడు పార్టీల నాయకులు పాల్గొన్నారు. సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరై, సభను విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *