Damodar rajanarsimha: ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టతనిచ్చారు. ప్రజలకు ఆరోగ్య సేవలు నిరంతరంగా అందించడం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సేవల్లో ఆటంకం కలగనివ్వరని ఆయన భరోసా ఇచ్చారు.
మంత్రి మాట్లాడుతూ, “ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా కొనసాగాలని మేం కోరుతున్నాం. మేం ఇచ్చిన లిబర్టీని గౌరవించాలి. గత తొమ్మిదిన్నర ఏళ్లలో చేయని బంద్‌ను ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు?” అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో నెలకు రూ.50 కోట్లు కూడా రిలీజ్ కాలేదని, దాంతో పేదలకు సేవలు సక్రమంగా అందలేదని ఆయన గుర్తు చేశారు.
ప్రస్తుతం మాత్రం తమ ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చిందని మంత్రి తెలిపారు. “మేము నెలకు రూ.100 కోట్లు ఇవ్వడానికి కమిట్‌మెంట్ ఇచ్చాం. ఈ విషయంలో ఎటువంటి వెనుకడుగు వేయము. ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవల్లో ఎలాంటి అంతరాయం కలగదు” అని రాజనర్సింహ హామీ ఇచ్చారు.
ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఎంతో మేలు చేసే పథకమని, వారి వైద్య ఖర్చులను భరించడంలో ఇది పెద్ద ఆధారమని మంత్రి గుర్తు చేశారు. ఈ కారణంగా ప్రభుత్వం పథకాన్ని నిరాటంకంగా కొనసాగించడమే కాకుండా మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు.