Daggubati Purandeswari: బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సాధించిన అద్భుతమైన విజయం రానున్న రోజుల్లో కూడా మళ్లీ వస్తుందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. బీహార్‌లో 68 శాతం ఓటింగ్ సాధించడం గొప్ప విషయమని ఆమె అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజల సంక్షేమ పథకాలను ఒకే విధంగా ముందుకు తీసుకువెళితే విజయాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలు ఒక నిదర్శనం అని పురంధేశ్వరి చెప్పారు. బీహార్ ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసిన ఘనత నితీష్ కుమార్ ఉందని, బీహార్ ప్రజలు మళ్లీ ఎన్డీఏకే అధికారం ఇచ్చారని ఆమె తెలిపారు. బీహార్ ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా ప్రధాని మోడీ, జేపీ నడ్డా, నితీష్ కుమార్ లను ఆమె అభినందించారు.
రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఎంపీ పురంధేశ్వరి రాష్ట్రానికి సంబంధించిన ఇతర ముఖ్య విషయాలను కూడా ప్రస్తావించారు. విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ (CII) సదస్సు వలన రాష్ట్రానికి చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయని ఆమె తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇటువంటి పెట్టుబడులు ఎంతో అవసరం అని చెబుతూ, ఈ పెట్టుబడులను ప్రతి ఒక్కరూ స్వాగతించాలని ఆమె సూచించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ పెట్టుబడులు బోగస్ అంటూ ఆరోపణలు చేయడం చాలా దురదృష్టకరం అని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు వేరే ఏ పనీ లేనందువల్లే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

