Cyclone Montha

Cyclone Montha: మొంథా తుఫాన్ ముప్పు.. ఏపీలో రెడ్‌ అలర్ట్‌ జారీ!

Cyclone Montha: ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం రాష్ట్ర తీరం వైపు అత్యంత వేగంగా దూసుకొస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది క్రమంగా పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని, ఆపై సోమవారం ఉదయానికి తుపానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఇది సోమవారం అర్ధరాత్రి దాటాక లేదా మంగళవారం తెల్లవారుజామున మరింత తీవ్రమై, అత్యంత ప్రమాదకరమైన తీవ్ర తుపానుగా రూపాంతరం చెందనుంది.

ఈ తుపాను ఉత్తర-వాయవ్య దిశగా పయనించి, మంగళవారం (28న) సాయంత్రానికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో, ముఖ్యంగా కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఎస్డీఎంఏ) హెచ్చరించింది. అయితే, బుధవారం ఉదయానికి తుపాను బలహీనపడి, సాధారణ తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: America: రాహుల్ గాంధీకి ఆ అర్హత లేదు: అమెరికన్ గాయని మేరీ మిల్బెన్

జిల్లాల వారీగా వర్షాల హెచ్చరికలు
తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా, సోమ, మంగళ, బుధవారాల్లో కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నందున రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఆదివారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయి.

సోమవారం నాడు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. వీటితో పాటు డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయి.

మంగళవారం తీరం దాటే సమయంలో కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఆ మరుసటి రోజు బుధవారం కూడా కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ తీవ్రత కొనసాగవచ్చు.

ప్రభుత్వం, అధికారులు తీసుకున్న చర్యలు
తుపాను ముప్పు నేపథ్యంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 8 ఎన్డీఆర్ఎఫ్ (జాతీయ విపత్తు స్పందన దళం), 9 ఎస్డీఆర్ఎఫ్ (రాష్ట్ర విపత్తు స్పందన దళం) బృందాలను సిద్ధంగా ఉంచారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం, మచిలీపట్నం, కాకినాడ వంటి ప్రధాన పోర్టులకు ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేశారు.

విద్యార్థుల భద్రత దృష్ట్యా అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అంతేకాక, ప్రభుత్వ అధికారులకు సెలవులను రద్దు చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సముద్ర తీరాలు ప్రమాదకరంగా మారినందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, అలాగే బీచ్‌లకు పర్యాటకులు రాకుండా చూడాలని తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి ఐఎండీ డాప్లర్ రాడార్ తో పాటు GPS “వన్ డే బెలూన్” వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగిస్తోంది. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *