Pawan Kalyan: మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తోంది. తుపాను తీరం దాటిన తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ముంచెత్తే వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో రహదారులు జలమయమవగా, చెట్లు విరిగి పడటంతో విద్యుత్ సరఫరా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను కొనసాగిస్తోంది. తుపాను ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా సమీక్ష నిర్వహించారు. తన కార్యాలయ అధికారుల ద్వారా నిరంతరం సమాచారం తీసుకుంటూ, అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు.
ఇది కూడా చదవండి: Bigg Boss 9: రీ-ఎంట్రీ ఇచ్చిన భరణి.. రావడం రావడమే మాధురితో శ్రీజ గొడవ
తుపాను వల్ల విద్యుత్ తీగలు తెగిపోవడం, స్తంభాలు పడిపోవడంతో వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆయన ఆదేశించారు. తుపాను బలహీనమైనా ఇంకా భారీ వర్షాలు కొనసాగుతున్నందున ప్రజలను సురక్షిత ప్రదేశాల్లోనే ఉంచాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి ఆహారం, వసతి సక్రమంగా ఉండేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెన్నా, గుండ్లకమ్మ నదులు ఉప్పొంగుతున్న నేపథ్యంలో తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. వర్షాలు తగ్గిన తరువాత పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి సరఫరా, వైద్య సేవలపై దృష్టి పెట్టాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

