Cyclone Ditwah: ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరాన్ని ఆనుకుని ఏర్పడిన తీవ్ర వాయుగుండం గురువారం ఉదయం తుఫానుగా బలపడిందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. ఈ తుఫాన్‌కు యెమెన్ దేశం సూచించిన ‘దిత్వా’గా నామకరణం చేశారు. శుక్రవారం (నవంబర్ 29) నుంచి మంగళవారం వరకు రాష్ట్రంలో దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది.
గురువారం సాయంత్రం నాటికి ఈ తుఫాను శ్రీలంకలోని బట్టికాలోవాకు 20 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 520 కి.మీ, చెన్నైకి 620 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం ఉత్తర-వాయవ్య దిశగా కదులుతున్న ఈ తుఫాను ఆదివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలను సమీపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
భారీ వర్షాలు, హెచ్చరికలు
దిత్వా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్రవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, ఆ తరువాత శనివారం నుంచి సోమవారం వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ తీవ్రత మరింత పెరుగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఆదివారం చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, వైఎస్సార్ కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు (కొన్ని ప్రాంతాల్లో 20 సెం.మీ. కంటే ఎక్కువ) నమోదయ్యే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం నుంచి కోస్తా తీరం వెంబడి గాలుల వేగం పెరుగుతుంది. శని, ఆదివారాల్లో గరిష్ఠంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని IMD తెలిపింది.
తుఫాను కారణంగా విశాఖపట్నం, మచిలీపట్నం సహా కోస్తా తీరంలోని అన్ని ఓడరేవుల్లో ప్రమాద సూచికలు (ఒకటో నంబరు హెచ్చరికలు) ఎగురవేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు స్పష్టం చేశారు.
Also Read: Green Card: కాల్పుల ఘటనలో గ్రీన్‌కార్డు హోల్డర్స్‌పై ట్రంప్ ఫోకస్: 19 దేశాలపై సమగ్ర సమీక్ష
అన్నదాతల్లో ఆందోళన
‘దిత్వా’ తుఫాను ప్రభావం రైతన్నలను తీవ్రంగా కలవరపెడుతోంది. ప్రస్తుతం కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరి కోతలు, నూర్పిళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. రోడ్ల పక్కన, ఆరుబయట ఆరబోసిన ధాన్యంపై ఈ వర్షాల ప్రభావం పడితే, గతంలో ‘మొంథా’ తుఫాను వల్ల కలిగిన నష్టం మాదిరిగానే ధాన్యం రంగుమారి, మొలకెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వరి కుప్పలు, ఉద్యానవన పంటలను రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని IMD రైతులకు సూచించింది. ప్రభుత్వం సరఫరా చేస్తామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో టార్పాలిన్ పట్టాలు, గన్నీ బ్యాగుల కొరత ఉందని రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితులను అలుసుగా తీసుకుని దళారులు మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. అయినప్పటికీ, ఈ-క్రాప్‌లో నమోదైన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి హామీ ఇచ్చారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

