Cyber Crime: ఓ వైపు సైబర్ నేరాలు…మరోవైపు రియల్ ఎస్టేట్ మోసాలు.. ఇంకోవైపు ఆర్థిక ద్రోహాలు, వెరసి, నేరస్ధుల ఉచ్చులో చిక్కి రాష్ట్ర ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. కేవలం ఫోన్ కాల్ ఆధారంగానే సైబర్ నేరగాళ్లు అజ్ఙాతంలో ఉండి వందల కోట్లు కొల్లగొడుతున్నారు. బడుగు ప్రజల సొంతింటి కలను ఆసరా చేసుకుని స్థిరాస్తి వ్యాపారులు మోసాలకు తెగబడుతున్నారు. తక్కువ ఖర్చుతో స్వల్ప వ్యవథిలో ఎక్కువ మొత్తంలో లాభాలు అంటూ ఆర్ధిక నేరస్ధులు మధ్య తరగతి ప్రజలను లూటీ చేస్తున్నారు. ఈ పరిస్ధితుల్లో ఎవరిని నమ్మాలి…? వీటి బారి నుంచి ఎలా బయటపడాలి..? అని తెలియక ప్రజలు సతమతమవుతున్నారు.
తాజాగా జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో సైబర్ నేరగాళ్లు భారీ మోసం చేశారు. మండలంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్న ప్రతాప్ అనే వ్యక్తి అకౌంట్ నుంచి రూ.1,15,000 రూపాయలు సైబర్ నేరగాళ్లు దొంగిలించారు.
Cyber Crime: తన అకౌంట్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు మాయమడంతో బాధితుడు పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరగాళ్లు అతని అకౌంట్ వివరాలను ఎలా సంపాదించాన్న విషయం ఇంకా తెలియదు అన్నారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ నేరగాళ్లచే జరుగుతున్న ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ తమ బ్యాంక్ సంబందిత వివరాలను పంచుకోవద్దని అధికారులు సూచించారు.