Anasuya Bharadwaj: హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న అసభ్యకర దాడులు, వేధింపులపై ఆమె గళమెత్తారు. ముఖ్యంగా గత ఏడాది డిసెంబర్ 23 నుంచి తనను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు ఆన్లైన్లో విపరీతమైన వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె పోలీసులకు వివరించారు. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని కించపరుస్తూ, పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నారని ఆమె తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వేధింపుల పర్వం కేవలం మాటలకే పరిమితం కాలేదు. తన ఫోటోలను మార్ఫింగ్ చేయడం, అసభ్యకరమైన వీడియోలను సృష్టించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి ఫోర్జరీకి పాల్పడటం వంటి తీవ్రమైన నేరాలు జరుగుతున్నాయని అనసూయ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వెల్లడించిన తర్వాతే, పక్కా ప్రణాళికతో తనపై సోషల్ మీడియాలో దాడి మొదలైందని ఆమె పేర్కొన్నారు. దీనివల్ల తాను తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నానని, ఒక మహిళగా, సెలబ్రిటీగా తన గౌరవాన్ని కాపాడాలని ఆమె కోరారు.
Also Read: Khushi Mukherjee: కెప్టెన్‌పై నిందలు.. నటికి నోటీసులు!
అనసూయ ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు పక్కా ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించి, మొత్తం 42 మందిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ జాబితాలో పలువురు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, టీవీ రంగానికి చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. ముఖ్యంగా బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియాచౌదరి గోగినేని, శేఖర్ బాషా, కరాటే కల్యాణి, టీవీ యాంకర్లు రోహిత్, మనోజ్ వంటి వారి పేర్లు ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరికొన్ని ఆన్లైన్ మీడియా పేజీలు, యూట్యూబ్ ఛానళ్లపై కూడా పోలీసులు నిఘా పెట్టారు.
