Cyber Attack: యూరప్‌లోని పలు ప్రముఖ విమానాశ్రయాలు భారీ సైబర్ దాడికి గురయ్యాయి. లండన్‌లోని హీత్రో, బెల్జియంలోని బ్రసెల్స్, జర్మనీలోని బెర్లిన్‌తో సహా అనేక విమానాశ్రయాలపై ఈ సైబర్ నేరగాళ్లు దాడి చేశారు. ఈ ఘటన కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విమానాశ్రయాల సేవా ప్రదాతలను (సర్వీస్ ప్రొవైడర్స్) లక్ష్యంగా చేసుకుని ఈ సైబర్ దాడి జరిగిందని అధికారులు వెల్లడించారు. దీని వల్ల చెక్-ఇన్, బోర్డింగ్ వంటి కీలకమైన వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సాంకేతిక సమస్య కారణంగా అనేక విమానాలు ఆలస్యం కాగా, కొన్ని విమాన సర్వీసులు రద్దు అయినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
బ్రసెల్స్ విమానాశ్రయంలో తీవ్ర అంతరాయం:
బ్రసెల్స్ విమానాశ్రయంలో ఆటోమేటెడ్ చెక్-ఇన్, బోర్డింగ్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయని అక్కడి అధికారులు తెలిపారు. ప్రస్తుతం తమ సాంకేతిక బృందం సమస్యను పరిష్కరించడానికి తీవ్రంగా కృషి చేస్తోందని, వీలైనంత త్వరగా సేవలు పునరుద్ధరిస్తామని అన్నారు. ఇప్పటికే విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
యూరప్‌లోని దాదాపు అన్ని ప్రఖ్యాత విమానాశ్రయాలు ఈ సైబర్ దాడికి గురైనట్లు సమాచారం. ఈ సాంకేతిక సమస్య వల్ల విమానాలు ఆలస్యమవడం, రద్దు కావడం వంటి పరిణామాలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు తమ విమానాల స్థితిని తెలుసుకోవడానికి ఆయా ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్లను నిరంతరం పరిశీలిస్తూ ఉండాలని విమానాశ్రయ అధికారులు సూచించారు. ఈ సైబర్ దాడి వెనుక ఎవరు ఉన్నారనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.