Elderly couple: ఇది కలికాలం.. కనకూడనివి ఎన్నో చూడాల్సి వస్తున్నది.. వినకూడనివి మరెన్నో వినాల్సి వస్తున్నది.. జరగకూడని ఘటనలు ఎన్నో జరిగిపోతూనే ఉన్నాయి. కనిపెంచిన తల్లిదండ్రులు ఎందరికో చేదు అవుతున్నారు. మాతృ, పితృ సమానులైన అత్తామామలను కోడళ్లు సాధిస్తున్నారు. దైవసమానులైన తాత, నాయనమ్మలు తర్వాతి తరానికి చులకనవుతున్నారు. ఇలా సమాజంలోని చాలా ఇండ్లలో నిత్యకృత్యమయ్యాయి. సరిగ్గా ఇలాంటిదే జరిగిందిక్కడ. వృద్ధ దంపతులను ఇంటి నుంచి వెళ్లగొట్టి కాఠిన్యం చూపింది వారి కొడుకు కుటుంబం. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన గురించి ఆ వృద్ధ దంపతులు మీడియాకు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం కింది విధంగా ఉన్నది.
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం కందగట్ట గ్రామంలో అర్రూరు నరసయ్య, అర్రూరు అనసూర్య భార్యాభర్తలు. కాయకష్టం చేసి కడుపున పుట్టిన కొడుకుని పెంచిపెద్ద చేశారు. పెళ్లి చేసి ఓ ఇంటి వాడిని చేశారు. ఐదెకరాల వ్యవసాయ భూమిని సమకూర్చిన ఆ దంపతులు ఏలోటూ లేకుండా కాలం గడుపుతూ వచ్చారు. కొడుకు, కోడలు, వారి పిల్లలతోనే ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ దశలో ఆ వృద్ధ దంపతులను వదిలించుకోవాలనుకున్నారో, వారి భారాన్ని భరించలేకపోయారో కానీ నరసయ్య, అనసూర్య కొడుకు కుటుంబం కక్షగట్టింది.
కడుపున పుట్టిన కొడుకే కదా అని భరిస్తూ వచ్చారు. మూడేండ్ల క్రితం వరకూ వ్యవసాయం చేస్తూ కుటుంబానికి ఆసరా అయ్యాడు. నరసయ్య. అయితే మూడేండ్ల క్రితం ఆ ఐదెకరాల భూమిని కొడుకే సాగు చేసుకుంటూ వస్తున్నాడు. ఇదేమిటి అని అంటే దూరం పెట్టసాగాడు. తమకు భుక్తం అడిగితే కాదు పొమ్మన్నాడు. కడుపున పుట్టిన కొడుకే కదా అని కొంతకాలం ఓపిక పట్టారు. అయినా వారు కనికరం చూపలేదు.
ఇదే విషయమై వృద్ధ దంపతులు పెద్ద మనుషులను ఆశ్రయించారు. సీజన్‌కు రూ.5,000 నగదు, పుట్టెడు వడ్లను కొడుకు తల్లిదండ్రులకు ఇవ్వాలని ఆ ఊరి పెద్దలు నిర్ణయించారు. కానీ, వారు ఇవ్వంపో అని తెగేసి చెప్పారు. అయినా తన కొడుకును బజారున వెయ్యొద్దని ఓపిక పట్టారు. అయితే భౌతికంగా తమపై దాడి చేస్తూ, మానసిక క్షోభకు గురిచేస్తూ తీవ్రంగా వేధించారని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటిబిగువున భరించినా, మంగళవారం రాత్రి మరోసారి తీవ్రంగా కొట్టి ఇంటి నుంచి గెంటేశారని దుఃఖభారంతో చెప్పుకొచ్చారు.
తమను కొడుకు కుటుంబం ఇంటినుంచి వెళ్లగొట్టిన వైనం, భుక్తం ఇవ్వకుండా పెడుతున్న ఇబ్బందులను సూర్యాపేటకు బుధవారం వచ్చిన ఆ వృద్ధ దంపతులు ఆర్డీవోకు ఏకరువు పెట్టారు. ఆ తర్వాత విలేకరుల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. హృదయ విదారకమైన ఈ ఘటన గురించి విన్నవారికి కంటనీరు ఆగలేదు. ఇప్పటికైనా నరసయ్య కొడుకు కుటుంబం మారుతుందని, ఆ వృద్ధ దంపతులను చేరదీస్తుందని ఆశిద్దాం. ఈ సమస్య మరే వృద్ధ దంపతులకూ రావద్దని కోరుకుందాం.