Tirumala: తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోవడంతో, క్యూ లైన్ వెలుపల ఉన్న కృష్ణతేజ అతిధి గృహం వరకు భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం దాదాపు 12 గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు.
తిరుమలలో నిన్నటి భక్తుల గణాంకాలను పరిశీలిస్తే, మొత్తం 65,600 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తమ మొక్కులు చెల్లించుకోవడానికి 24,292 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం రూ.4.18 కోట్లుగా నమోదైంది. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది తాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తూ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
