Supreme Court: ప్రముఖ నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2019 నాటి ఒక కేసులో వారిపై నమోదైన క్రిమినల్ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు లోక్‌సభ ఎన్నికల సమయంలో, శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ మోహన్ బాబు, మంచు విష్ణు తిరుపతి-మదనపల్లి రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించారు. అప్పటికి ఎన్నికల నియమావళి అమల్లో ఉండటంతో, నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే ఆరోపణలతో వారిపై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ మోహన్ బాబు, మంచు విష్ణు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హైకోర్టు వారి అభ్యర్థనను తోసిపుచ్చింది. దీనితో వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Also Read: Kalpika Ganesh : నా కూతురికి మెంటల్ డిజార్డర్ ఉంది: గచ్చిబౌలి పోలీసులకు కల్పిక తండ్రి ఫిర్యాదు!
తాజాగా జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును కొట్టివేసింది. మోహన్ బాబు, మంచు విష్ణు తమ వాక్ స్వాతంత్ర్య హక్కు మరియు శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును వినియోగించుకున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. వారిపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని, అలాగే ప్రజలకు ప్రమాదం కలిగించే విధంగా వారు ప్రవర్తించినట్లు రుజువులు లేవని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును కొనసాగించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని పేర్కొంటూ, వారిపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్‌ను రద్దు చేసింది. ఈ తీర్పుతో మోహన్ బాబు, మంచు విష్ణుకు సుదీర్ఘకాలం సాగిన ఈ న్యాయపోరాటంలో భారీ ఊరట లభించింది.