DGP Shivadhar Reddy: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, మొత్తం మీద నేరాల సంఖ్య 2.33 శాతం తగ్గిందని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. ఏడాది ముగింపు సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్రవ్యాప్త నేర గణాంకాలను విడుదల చేశారు. మహిళల భద్రత కోసం పని చేస్తున్న ‘షీ టీమ్స్’వల్ల మహిళలపై జరిగే నేరాలు గణనీయంగా తగ్గాయని, ముఖ్యంగా వరకట్న హత్యలు, వేధింపుల కేసులు తక్కువగా నమోదయ్యాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
సైబర్ నేరాలపై ఉక్కుపాదం భారీగా రికవరీ టెక్నాలజీ పెరిగే కొద్దీ సవాలుగా మారుతున్న సైబర్ నేరాలను అరికట్టడంలో తెలంగాణ పోలీస్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని డీజీపీ తెలిపారు. దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ 41 శాతం పెరుగుతుంటే, మన రాష్ట్రంలో మాత్రం 3 శాతం తగ్గడం విశేషం. సైబర్ బాధితుల నుండి దోచుకున్న సుమారు ₹246 కోట్లను పోలీసులు రికవరీ చేశారు. ఇందులో ₹150 కోట్లను ఇప్పటికే 25,500 మంది బాధితుల ఖాతాల్లోకి తిరిగి చేర్చారు. సైబర్ నేరగాళ్లను పట్టుకోవడంలో మన పోలీసులు వేగంగా స్పందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
చిన్నారుల రక్షణలో తెలంగాణ నంబర్ వన్ పిల్లల అక్రమ రవాణాను అరికట్టడంలోనూ, తప్పిపోయిన పిల్లలను తల్లిదండ్రుల వద్దకు చేర్చడంలోనూ తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ‘ఆపరేషన్ స్మైల్’, ‘ముస్కాన్’ ద్వారా ఈ ఏడాది 12,396 మంది చిన్నారులను రక్షించారు. 481 చైల్డ్ ట్రాఫికింగ్ కేసులు నమోదు చేసి, దాదాపు 1,277 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అలాగే, నేరగాళ్లకు శిక్ష పడేలా చేయడంలోనూ పురోగతి కనిపించింది. పోక్సో చట్టం కింద నేరం రుజువైన ముగ్గురికి ఉరిశిక్ష, మరో 320 మందికి జీవిత ఖైదు పడటం గమనార్హం.
నమ్మక ద్రోహం కేసులు పెరగడంపై ఆందోళన అన్ని రంగాల్లో నేరాలు తగ్గుముఖం పట్టినా,’నమ్మక ద్రోహం’కేసులు మాత్రం ఈ ఏడాది 23 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోందని డీజీపీ చెప్పారు. అంటే తెలిసిన వారే మోసాలకు పాల్పడటం ఎక్కువైందని దీని అర్థం. మరోవైపు, రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగినప్పటికీ, మరణాల సంఖ్య తగ్గడం కొంత ఉపశమనం కలిగించే అంశం. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని, అందుకే ఎన్.డి.పి.ఎస్ (NDPS) కేసుల నమోదు 30 శాతం పెరిగిందని ఆయన వివరించారు.
కొత్త పోలీస్ స్టేషన్లు విజయవంతమైన కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కొత్తగా హైడ్రా (HYDRAA) పోలీస్ స్టేషన్‌తో పాటు రాజేంద్రనగర్, మేడ్చల్ ప్రాంతాల్లో పూర్తిస్థాయి పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. ఈ ఏడాది మెస్సీ పర్యటన వంటి అంతర్జాతీయ ఈవెంట్లు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని ఆయన కొనియాడారు. చివరగా, శామీర్‌పేట పోలీస్ స్టేషన్ దేశంలోనే 7వ ఉత్తమ స్టేషన్‌గా నిలవడం మన రాష్ట్ర పోలీసుల పనితీరుకు నిదర్శనమని ఆయన గర్వంగా ప్రకటించారు.
