Crime News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చోడవరం సబ్ జైలు నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు సినీ పక్కీలో పరారయ్యారు. విధుల్లో ఉన్న హెడ్‌వార్డర్‌పై తీవ్రంగా దాడి చేసి, అతని వద్ద ఉన్న తాళాలను బలవంతంగా లాక్కొని వెళ్లారు. ఈ ఘటనతో శాంతిభద్రతల అంశం ప్రశ్నార్థకంగా మారింది. జైలుల్లో భద్రతా చర్యలను తేటతెల్లం చేస్తున్నది. దొంగలు, నిందితులను బంధించి జైలులో ఉంచి రక్షణగా ఉండే వార్డర్‌పై తీవ్ర దాడి జరిగినా ఇతర సిబ్బంది లేరా? రాలేదా? అన్న అంశంపైనా ఆలోచన రేకెత్తిస్తున్నది.
Crime News: ఏపీలోని అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలులో ఇద్దరు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వారిలో ఒకరు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం టోకూరు పంచాయతీ కార్యదర్శి నక్కా రవికుమార్ ఉన్నాడు. సామాజిక పింఛన్ల సొమ్మును కాజేసిన కేసులో అతను రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అదే విధంగా మరొక వ్యక్తి మాడుగులకు చెందిన బెజవాడ రాము బంగారం చోరీ కేసులో రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నాడు.
Crime News: నిన్న సాయంత్రం వంట పనులు చేయించేందుకు వీరిద్దరినీ సెల్ నుంచి జైలు సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. వంట పనులు చేస్తున్నట్టుగా నటించసాగారు. ఈలోగా రవికుమార్ అనే ఖైదీ అక్కడే ఉన్న ఓ సుత్తిని తీసుకొని గేటు వద్ద ఉన్న గదిలో విధుల్లో ఉన్న జైలు వార్డర్ బీ వీర్రాజుపై దాడికి దిగాడు. సుత్తితో పదేపదే కొట్టసాగాడు.
Crime News: తీవ్ర గాయాలతో వార్డర్ వీర్రాజు కింద పడిపోవడంతో అతని వద్ద ఉన్న తాళాల గుత్తిని తీసుకొని గేటు తెరుచుకొని ఇద్దరు ఖైదీలైన రవికుమార్, రాము కలిసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీస్ ఉన్నతాధికారులు జైలుకు చేరుకొని విచారించారు. పరారైన ఖైదీల కోసం పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వార్డర్ వీర్రాజును చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.