Crime News: హైదరాబాద్ నగరం పరిధిలో భూ తగాదాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. ఎప్పుడూ భూ తగాదాలతో ఎన్నో కుటుంబాలు వివిధ రకాల కారణాలతో రోడ్డున పడిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా భూ వివాదం కారణంగా ఇరువర్గాలు పరస్పరం కత్తులు, రాళ్లతో దాడులు చేసుకోగా, నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో చోటుచేసుకున్నది. ఈభూవివాదంలో విశేషమేమిటంటే.. హైడ్రా, హైకోర్టు, రెవెన్యూ, పోలీసుల నడుమ పలు మలుపులు తిరుగుతున్నది.
Crime News: హయత్‌నగర్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడలోని ఓ సర్వేనంబర్ లోని సుమారు 7.5 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన కంగుల రాములు, పోచయ్యతోపాటు మరికొందరి నుంచి కంగుల గండయ్య, ఈదయ్య జీపీఏ చేసుకున్నారు. ఆ తర్వాత 1970లో సదరు భూమిలో 170 ప్లాట్లు చేసి విక్రయించారు. అయితే జీపీఏ చెల్లదంటూ కంగుల కుటుంబానికి చెందిన వారసులు, ఇదే భూమిని 2013లో బ్రాహ్మణపల్లికి చెందిన సంరెడ్డి బాల్‌రెడ్డి విక్రయించారు.
Crime News: సంరెడ్డి బాల్‌రెడ్డి ఆ భూమిలో ఫాంహౌజ్‌తోపాటు చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఈ నేపథ్యంలో 2014 నుంచి ప్లాట్ల యజమానులు, బాల్‌రెడ్డి మధ్య వివాదం కొనసాగుతున్నది. దీనిపై ప్లాట్ల యాజమానులు కోర్టును ఆశ్రయించగా, 2025 మార్చి 28న జిల్లా న్యాయస్థానం వీరికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Crime News: ఆ ఉత్తర్వుల ఆధారంగా ప్లాట్ల యాజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో లేఅవుట్ రోడ్లను ఆక్రమించి ఫాంహౌజ్‌ను నిర్మించారనే కారణంగా రెండు నెలల క్రితం హైడ్రా అధికారులు ఫాహౌజ్ చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చేశారు. దీనిని సవాల్ చేస్తూ బాల్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైడ్రా, పోలీసులు, రెవెన్యూ శాఖల నుంచి అధికారులు ఇందులో జోక్యం చేసుకోవద్దని హైకోర్టులు ఉత్తర్వులు జారీ చేసింది.
Crime News: ఇదిలా ఉండగా, కొందరు ప్లాట్ల యజమానులు తమ స్థలాలను చదును చేసుకునేందుకు తాజాగా జేసీబీని తీసుకొచ్చారు. దీనిని గమనించిన బాల్‌రెడ్డి, అతని అనుచరులు ప్లాట్ల యాజమానులతో వాగ్వాదానికి దిగారు. బాల్‌రెడ్డి వర్గం వారు రాళ్లు, కర్రలు, కత్తితో దాడి చేయడంతో సత్యనారాయణరెడ్డి, నవీన్, వెంకటేశ్, మరొకరికి గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.