Cricket: ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై సోషల్ మీడియాలో రిటైర్మెంట్ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, ఈ పుకార్లకు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చెక్ పెట్టారు.
ఆస్ట్రేలియాతో అడిలైడ్ వన్డేలో కోహ్లీ సున్నా పరుగులకే ఔటయ్యాడు. మైదానాన్ని వీడుతున్న సమయంలో ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో (స్టాండింగ్ ఓవియేషన్) అభినందించారు. ఈ దృశ్యాన్ని కొందరు కోహ్లీ వీడ్కోలు సంకేతమని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.
దీనిపై గవాస్కర్ స్పందిస్తూ,> “రెండు డకౌట్లు వస్తేనే ఎవరి కెరీర్ ముగిసిందని అనుకోవడం సరికాదు. వన్డేల్లో 52 సెంచరీలు, 14 వేల పరుగులు, టెస్టుల్లో 32 శతకాలు చేసిన ఆటగాడి గురించి ఇలాంటి మాటలు అనడం అన్యాయం. కోహ్లీ కెరీర్ ఇంకా చాల దూరం ఉంది,” అని చెప్పారు.
అలాగే,> “అడిలైడ్‌లో మంచి రికార్డు ఉన్న కోహ్లీ వైఫల్యాన్ని అభిమానులు అంగీకరించలేకపోవడం సహజం. కానీ ఇది అతని కెరీర్‌కు ముగింపు కాదు. కోహ్లీ అంత తేలికగా వెనక్కి తగ్గే వాడు కాదు. సిడ్నీలో జరిగే తర్వాతి మ్యాచ్‌లో అతను భారీ ఇన్నింగ్స్ ఆడినా ఆశ్చర్యం లేదు,” అని గవాస్కర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
అంతేకాక, ఆయన కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్‌లో కూడా రోహిత్ శర్మతో కలిసి ఆడతాడని నమ్మకం వ్యక్తం చేశారు.

