Aditya 369: టాలీవుడ్‌లో తొలి టైమ్ ట్రావెల్ చిత్రంగా వచ్చి సంచలనం సృష్టించిన ‘ఆదిత్య 369’ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందమూరి బాలకృష్ణ హీరోగా, సింగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వంలో 1991లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. టైమ్ మెషిన్ ద్వారా హీరో విభిన్న కాలాలకు ప్రయాణించే సరికొత్త కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు రీ-రిలీజ్‌తో మళ్లీ సందడి చేస్తోంది.ఈ రీ-రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్స్ థియేటర్ వద్ద టైమ్ మెషిన్‌ను ప్రదర్శనకు ఉంచారు. దీంతో అభిమానులు, ప్రేక్షకులు దీన్ని చూసి ఆనందిస్తున్నారు. ఈ చిత్రంలో మోహిని హీరోయిన్‌గా నటించగా, సిల్క్ స్మిత, సుత్తివేలు, అమ్రిష్ పూరి, టిన్ను ఆనంద్ కీలక పాత్రల్లో కనిపించారు. ఇళయరాజా సంగీతం చిత్రానికి ప్రాణం పోసింది. రీ-రిలీజ్‌లో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్‌ను రాబడుతుందనే ఆసక్తి నెలకొంది. గతంలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం మరోసారి వెండితెరపై మాయ చేస్తుందా? అభిమానులు ఎంతమంది థియేటర్లకు క్యూ కడతారో చూడాలి. ‘ఆదిత్య 369’ మరోసారి తన హవాను చూపిస్తుందని అంతా ఆశిస్తున్నారు.
