Samineni Ramarao: ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సీపీఎం సీనియర్ నేత, రైతు సంఘం నాయకుడు సామినేని రామారావు (Samineni Ramarao)ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. శుక్రవారం ఉదయం పాతర్లపాడులో మార్నింగ్ వాక్‌కు వెళ్లిన రామారావుపై దుండగులు దాడి చేసి గొంతుకోసి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
ఇక మూడు రోజుల్లోనే రామారావు మనవరాలు పెండ్లి ఉండగా ఆయన హత్యతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, అలాగే పాతర్లపాడు గ్రామ సర్పంచ్‌గా ఆయన సేవలు అందించారు.
ఇది కూడా చదవండి: Peddi: రామ్ చరణ్-జాన్వీ శ్రీలంక ల్యాండింగ్.. పెద్ది పాట షూట్!
ఈ ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులను వెంటాడి చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో హింసాత్మక రాజకీయాలకు తావు ఇవ్వబోమని హెచ్చరించారు. క్లూస్ టీమ్, స్నిఫర్ డాగ్స్, సైబర్ టీమ్‌ల సహాయంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.


