CPI Ramakrishna: ఆంధ్రప్రదేశ్ ఎంపీలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేత దశకు చేరుకుంటుంటే, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలని కోరడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
రామకృష్ణ ఆగ్రహం
విశాఖలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన రామకృష్ణ, ఏపీ ఎంపీల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం అవుతోంది. 34 మంది బలిదానాల ఫలితంగా సాధించుకున్న కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేటీకరించాలని చూస్తోంది. అలాంటి సమయంలో పార్లమెంట్‌లో మీరు అడగాల్సింది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని. కానీ, మీరు అనకాపల్లిలో ఉన్న ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలని కోరుతారా?” అని నిలదీశారు.
చరిత్ర క్షమించదు
ఏపీ ఎంపీల తీరు చరిత్రలో నిలిచిపోతుందని, వారిని చరిత్ర క్షమించదని రామకృష్ణ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సింది పోయి, ప్రైవేట్ కంపెనీలకు వత్తాసు పలకడం ఎంతమాత్రం సరికాదని హితవు పలికారు. ఇది ప్రజలకు చేస్తున్న ద్రోహమని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు.