CPI Narayana: అందాలు పోటీలు మంచివి కాదు.. ఆడవారిని కించపరిచేలా ఉంటాయి.. అందాల పోటీలు ముఖ్యం కాదు పేదల గురించి పట్టించుకోండి.. అని నేనెందుకు అన్నానో ఇప్పుడైనా అర్థమైందా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో అందాల పోటీల నిర్వహణను తప్పుబడుతూ మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన సంచలన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు.
CPI Narayana: మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ ఆరోపణలతో తన వ్యాఖ్యల ఉద్దేశం అందరికీ అర్థమై ఉంటుందని నారాయణ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మిస్-వరల్డ్-2025 పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ అకస్మాత్తుగా వైదొలగి, నిర్వాహకులపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
CPI Narayana: అయితే మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై స్పందించిన నారాయణ.. తాను ఆనాడు చేసిన వ్యాఖ్యలపై పలువురు విమర్శించారని, తాను చేసిన వ్యాఖ్యలపై వారికి ఇప్పటికైనా అర్థమై ఉండాలని హితవు పలికారు. అలా ఎందుకు అనాల్సి వచ్చిందో ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుందని తెలిపారు. ఎన్నో ప్రజా సమస్యలను పక్కనబెట్టి, ఉద్యోగుల జీతాలు పెంచకుండా, అందాల పోటీల నిర్వహణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం సిగ్గుచేటు అని ఆనాడు నారాయణ ధ్వజమెత్తారు.
CPI Narayana: కోట్లల్లో ఖర్చు పెట్టేది సొల్లు కార్చుకోవడానికా? అంటూ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందాల పోటీలు మహిళలను అంగడి సరుకుగా, బహిరంగ వేలం వేయడం లాంటిదని, ఇది స్తీత్వం పవిత్రతకు అవమానకరమని నారాయణ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. ప్రభుత్వాలు మహిళలను శక్తివంతం చేయడం, వారికి ఉపాధి అవకాశాలను కల్పించడంలో దృష్టి పెట్టాలని హితవు పలికారు.

