CPI Narayana: సినిమా పరిశ్రమలో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. హీరోలు, హీరోయిన్లు కోట్లకు కోట్లు పారితోషికాలు తీసుకుంటున్నారని, కానీ వారికి పేరు తీసుకొచ్చే కార్మికులను పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
హీరోలకు కోట్లు, కార్మికులకు కనీస వేతనాలు కూడా లేవా?
హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నారాయణ, టాలీవుడ్‌లో కార్మికులు సమ్మె చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. “సినిమా అంటే కేవలం డైరెక్టర్, హీరో, హీరోయిన్ మాత్రమే కాదు. తెర వెనుక కష్టపడే కార్మికులు ఉంటేనే వారికి పేరు వస్తుంది. హీరోలు కోట్లలో పారితోషికాలు తీసుకుంటున్నప్పుడు, కష్టపడే కార్మికులకు కనీస వేతనాలు ఎందుకు ఇవ్వరు?” అని ప్రశ్నించారు.
రజనీకాంత్ మేకప్ లేకుండా ఎలా ఉంటారు?
హీరోలు, హీరోయిన్లను అందంగా చూపించే మేకప్ కార్మికులను విస్మరిస్తున్నారని నారాయణ మండిపడ్డారు. “సూపర్ స్టార్ రజనీకాంత్ మేకప్ లేకుండా ఎలా ఉంటారో ఒక్కసారి ఆలోచించండి” అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్మికులను విస్మరిస్తే కమ్యూనిస్ట్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు.
సినిమా పరిశ్రమ నలుగురి చేతుల్లో ఉంది
తెలుగు రాష్ట్రాల్లో సినిమా పరిశ్రమ కేవలం నలుగురు వ్యక్తుల చేతుల్లో ఉందని నారాయణ ఆరోపించారు. సందేశాత్మక సినిమాలకు విలువ ఇవ్వకుండా, పాన్ మసాలా, మద్యం, జూదం వంటి అంశాలతో కూడిన సినిమాలకు విలువ ఇస్తున్నారని ఆయన విమర్శించారు.
చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలపై వివరణ
గతంలో చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నానని, కానీ ఇప్పుడు ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసి తనను బద్నాం చేయడం సరికాదని ఆయన తెలిపారు. ఈ విషయంలో వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు.
సీఎం ప్రొడ్యూసర్లతోనే మాట్లాడుతారు
ముఖ్యమంత్రి ప్రొడ్యూసర్లతో మాత్రమే మాట్లాడతారని, కానీ సినిమా కార్మికులను పిలిచి ఎందుకు మాట్లాడటం లేదని నారాయణ ప్రశ్నించారు. బ్లాక్‌లో టికెట్లు అమ్ముకునే పద్ధతిని ప్రభుత్వాలు ప్రోత్సహించడం సరికాదని ఆయన అన్నారు. విలాసవంతమైన సినిమాలు తీసి, నైతిక విలువలను పాడు చేస్తూ కోట్లు గడిస్తున్న నిర్మాతలు, కార్మికులను పట్టించుకోకపోవడం దారుణమని నారాయణ అభిప్రాయపడ్డారు.