Cpi narayana: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, అబద్ధాలు చెప్పడంలో ఈ ఇద్దరూ దిట్టలని వ్యాఖ్యానించారు. “అబద్ధాల పరంగా గోబెల్స్ మొదటి వారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ అతన్ని మనం చూడలేకపోయాం. మోడీ, కేసీఆర్‌ను మాత్రం నిత్యం చూస్తున్నాం” అంటూ ఎద్దేవా చేశారు.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం ప్రతి సంఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యే సమయంలోనే పహెల్గామ్ ఉగ్రదాడిలో ముష్కరులు హతమయ్యారని వార్తలు రావడంపై సందేహాలు వ్యక్తం చేశారు. “ఉగ్రవాదులు ముందే దొరికినట్లయితే ఇప్పటివరకు ఎందుకు దాచిపెట్టారు? ఎలాంటి రాజకీయ ప్రయోజనం కోసం ఇది జరుగుతోంది?” అని ప్రశ్నించారు.
అమర్‌నాథ్ యాత్రకు 7.5 లక్షల మంది భద్రతా సిబ్బంది ఉండగా, అట్టి భద్రత మధ్య ఉగ్రదాడులు ఎలా జరిగాయో ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. ఇది భద్రతా విఫలమైందని స్పష్టంగా చూపుతోందని చెప్పారు.
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మృతులకు కోటి రూపాయల పరిహారం ప్రకటిస్తే, పహెల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేవలం లక్ష రూపాయలే ఎందుకు ఇచ్చారన్న ప్రశ్నతో కేంద్రాన్ని నిలదీశారు. మృతుల ప్రాణాల విలువ కూడా బీజేపీకి ఓటు బ్యాంకుతోనే లెక్కలుగా కనిపిస్తోందని విమర్శించారు.
ఉగ్రవాదం వంటి సమస్యలను పరిష్కరించాలంటే ప్రతిపక్షాల సహకారం అవసరమని, అయితే బీజేపీ పార్టీ దీన్ని కూడా రాజకీయ లబ్ధికి వాడుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.