CPI: భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) వంద ఏళ్ల వేడుకలు ఖమ్మం నగరంలో అత్యంత ఘనంగా జరిగాయి. సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మరియు పలువురు మంత్రులు పాల్గొన్నారు.
త్యాగాల చరిత్ర సీపీఐది 1925లో కాన్పూర్‌లో మొదలైన సీపీఐ ప్రస్థానం ఎన్నో త్యాగాలతో కూడుకున్నదని డి.రాజా కొనియాడారు. భారతదేశానికి ‘సంపూర్ణ స్వరాజ్యం’ కావాలని తొలిసారిగా నినదించిన పార్టీ సీపీఐ అని ఆయన గుర్తు చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్, సీపీఐ కలిసి కీలక పాత్ర పోషించాయని, కానీ ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ (RSS) పాత్ర ఏమీ లేకపోగా, బ్రిటీష్ పాలకులకు మద్దతుగా నిలిచిందని విమర్శించారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: సింగరేణి టెండర్లలో అవినీతికి తావులేదు.. తప్పుడు వార్తలు రాస్తే ఊరుకోం
అమెరికా, ఇజ్రాయెల్ తీరుపై ఆగ్రహం ప్రస్తుతం పాలస్తీనాలో జరుగుతున్న దాడులను డి.రాజా తీవ్రంగా ఖండించారు. వేల మంది అమాయకులను ఊచకోత కోస్తున్న ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇస్తోందని మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆయన హిట్లర్‌తో పోల్చారు. ట్రంప్ ఒక నియంతలా మారి ప్రపంచ దేశాలను బెదిరిస్తున్నారని, అటువంటి వ్యక్తి ముందు ప్రధాని నరేంద్ర మోదీ తలవంచడం దేశానికే గర్వహీనమని ఆవేదన వ్యక్తం చేశారు.
మోదీ పాలనపై విమర్శలు దేశాభివృద్ధి కోసం ప్రధాని మోదీ చేసిందేమీ లేదని రాజా విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి, కేవలం కొన్ని శక్తుల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. ఖమ్మం నగరం అంతా ఎర్రజెండాలతో నిండిపోయిన ఈ సభ, భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీ బలాన్ని చాటిచెబుతుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశాయి.
