CPI

CPI: సుడా చైర్మన్‌ పదవిపై కన్నేసిన సీపీఐ

CPI: తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకమైన పట్టణాభివృద్ధి డెవలప్మెంట్ సంస్థలలో సిద్దిపేట సుడా అథారిటీ ఒకటి. సుడా చైర్మన్ పదవి కోసం రెండు పార్టీల నేతల మధ్య పోటీ నెలకొంది. అధికార కాంగ్రెస్‌తో పాటు మిత్రపక్షపైన సీపీఐ ఈ పీఠంపై గురి పెట్టాయి. నామినేటెడ్ పదవిపై హస్తం పార్టీ పోటీ పడుతున్న సమయంలో సీపీఐ కూడా పోటీ పడుతుంది. కాంగ్రెస్ నేతలకు ఇది ఇబ్బందికర పరిణామంగా మారింది. గత ఎన్నికల్లో సీపీఐ హుస్నాబాద్ సీటు ఆశించింది.

కానీ కాంగ్రెస్ అధిష్టానం పొన్నం ప్రభాకర్‌కు కేటాయించడంతో గెలిచి మంత్రి అయ్యారు. పొన్నం ప్రభాకర్‌ విజయం కోసం కృషి చేసిన తమను నామినేటెడ్ పోస్టుల విషయంలో విస్మరించడం సరికాదని సీపీఐ వాదన…2023 సార్వత్రిక ఎన్నికల సమయంలో సీపీఐకి ఎమ్మెల్సీ పదవులు, మరో రెండు కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఇస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చిందట…ఆ ప్రకారం ఇప్పుడు సుడా సీటు కోసం సీపీఐ త్రీవ స్థాయిలో ప్రయత్నిస్తుంది. 

CPI: బీఆర్ఎస్ పాలనలోనే సిద్దిపేట అర్బన్ అథారిటీ డెవలప్మెంట్ సంస్థ ఏర్పడింది. 2017 అక్టోబర్ 30న సుడా ఆవిర్భవించింది. 2018 ఏప్రిల్ 14న పాలక మండలి ఏర్పాటయ్యింది. పాలక మండలి చైర్మన్‌గా రవీందర్ రెడ్డి పనిచేశారు. సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు 26 గ్రామాలకే పరిమితమైన సిద్దిపేట అర్బన్ డెవలప్​మెంట్ ​అథారిటీ సుడాని జిల్లా మొత్తం విస్తరించారు. హెచ్ఎండిఏలోని వర్గల్, ములుగు, మర్కూక్, మండలాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాలను సిద్ధిపేట పట్టణ అభివృద్ధి సంస్థలో చేర్చారు. గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీతో పాటు 22 మండలాల పరిధిలోని 280 గ్రామాలను సుడాలో చేర్చారు. దీంతో డైరెక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ డీటీసీపీ రద్దయ్యే అవకాశం ఉంది.

సిద్దిపేట జిల్లా మొత్తం సుడాలోనే ఉంది. దీంతో చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్‌, సీపీఐ నేతల మధ్య పోటీ నెలకొంది. గతంలో సిద్దిపేట నుంచి ఆశావాహులు ఉన్నారు. ఇప్పుడు గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల స్థానాల నేతలు కూడా రేసులోకి వచ్చారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అలాగే గాడిపల్లి శీను, తాడూరి శ్రీనివాస్‌తోపాటు మరికొందరు ఆశలు పెట్టుకున్నారు. మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ లాబీయింగ్ పెట్టుకున్నారు. మరోవైపు సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌కు సీటు ఆశిస్తున్నారు.  

CPI: హుస్నాబాద్‌లో పొన్నం ప్రభాకర్‌ గెలుపు కోసం కృషి చేశానని ఆయన గుర్తు చేస్తున్నారు. ఈ సుడా చైర్మన్ పదవి తమకే ఇవ్వాలని కొందరు నేతలు పట్టు పడుతున్నారు. హుస్నాబాద్‌లో సీపీఐకు బలమైన క్యాడర్ ఉంది. దీంతో సీపీఐ తమ క్యాడర్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ పదవి ఆశిస్తున్న మంద పవన్ ఇదే విషయాన్ని మంత్రి పోన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. సుడా ఛైర్మన్‌ పదవి ఎవరికీ కేటాయిస్తారో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *