CP Sajjanar: హైదరాబాద్‌లోని నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక నివాస భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ఈ ప్రమాదానికి సంబంధించి సీపీ సజ్జనార్ మీడియాకు కీలక వివరాలు వెల్లడించారు. భవనం కింద ఉన్న సెల్లార్లో పెద్ద ఎత్తున ఫర్నీచర్ నిల్వ చేసి ఉండటమే ప్రమాద తీవ్రత పెరగడానికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. దట్టమైన పొగ అలుముకోవడంతో భవనం లోపలికి వెళ్లడం రెస్క్యూ టీమ్‌కు సవాలుగా మారింది. ప్రస్తుతం జేసీబీల సహాయంతో ఆ ఫర్నీచర్‌ను తొలగించి, లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Puri Jagannadh: పెంగ్విన్ వైరల్ కథ.. పూరీ జగన్నాథ్ విషాద బ్యాక్ స్టోరీ!
మరోవైపు, ఈ ప్రమాద సమయంలో భవనం లోపల ఇద్దరు పిల్లలతో సహా మొత్తం ఆరుగురు చిక్కుకున్నట్లు సమాచారం రావడంతో అంతా ఆందోళన చెందుతున్నారు. గాలి వెలుతురు సరిగ్గా లేకపోవడం, పొగ ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు కొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. జనావాసాల మధ్య ఇలాంటి గోడౌన్లు ఉండటం ప్రమాదకరమని, వీటి వల్లే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని సీపీ అభిప్రాయపడ్డారు.
ఈ అగ్నిప్రమాదం కారణంగా నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని నాంపల్లి ఎగ్జిబిషన్ (నుమాయిష్) సందర్శనకు రావాలనుకునే వారు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. అగ్నిమాపక వాహనాలు మరియు రెస్క్యూ టీమ్స్ రాకపోకలకు ఇబ్బంది కలగకుండా వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
