Cp sajjanar: హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ పేర్కొన్న ప్రకారం, మహిళా ఐఏఎస్ అధికారిపై ఎలాంటి ఆధారాలు లేకుండా వార్తలను ప్రసారం చేశారనే ఆరోపణలతో ఎన్ టీవీ రిపోర్టర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఈ వివాదాస్పద కథనం పట్ల నమోదైన కేసులో దర్యాప్తు సాగుతుండగా, సంబంధిత జర్నలిస్టులు దానికి సహకరించలేదని పోలీసులు తెలిపారు.
సజ్జనార్ వివరించిన ప్రకారం, రాత్రికి రాత్రే దేశం విడిచిపోవడానికి ప్రయత్నించిన నేపథ్యంలో రిపోర్టర్లను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. సిట్ దర్యాప్తు చేయడానికే ఏర్పాటు అవుతుందని, విచారణ జరుగుతుండగా నోటీసులు పంపాల్సిన అవసరం ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. రిపోర్టర్లు చేసిన పని చట్టబద్ధమైనదైతే దర్యాప్తుకు భయపడాల్సిన పని లేదని ఆయన పేర్కొన్నారు.
ఈ కేసులో ఎన్టీవీ సీఈఓ పాత్రపై కూడా సజ్జనార్ ప్రశ్నలు లేవనెత్తారు. విచారణకు పిలిస్తే ఎందుకు హాజరుకాకుండా తప్పించుకుంటున్నారని తెలిపారు. విచారణకు కీలక వ్యక్తులుగా ఉన్నవారు తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోవడం అనుమానాస్పదమని అన్నారు. బ్యాంకాక్ పేరుతో బయటకు వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తే వారికి అడ్డుపడకుండా ఎలా ఉంటామని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరైనా అరెస్టుకు గురవుతారని, విచారణకు సహకరించనట్లయితే ఇళ్లకే వెళ్లి వారిని తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఎక్కడికి వెళ్లినా పోలీసులు గుర్తించి, చట్టం ముందు హాజరు పరుస్తామని ఆయన చివరగా తెలిపారు.
