Digital Arrest: సైబర్ నేరగాళ్లు సృష్టించిన ‘డిజిటల్ అరెస్ట్’ ఉచ్చులో పడి ముంబైకి చెందిన ఓ రిటైర్డ్ బ్యాంకర్ దంపతులు ఏకంగా మూడు రోజుల పాటు వీడియో కాల్‌లో ఉండి తమ జీవిత పొదుపులో నుంచి రూ. 50.5 లక్షలు పోగొట్టుకున్నారు. ఈ తరహా మోసాలు రోజురోజుకు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ముంబైలోని రిటైర్డ్ బ్యాంకర్‌కి సెప్టెంబర్ 11, 24 మధ్య వాట్సాప్ ద్వారా నాసిక్ పోలీసు అధికారిగా పరిచయం చేసుకున్న వ్యక్తి నుంచి కాల్ వచ్చింది.
మనీ-లాండరింగ్ కేసులో ఆయన పేరు ఉందని, నకిలీ ఎఫ్‌ఐఆర్ (FIR) కూడా చూపించారు. ఆ తర్వాత నిందితుడు ఎన్‌ఐఏ (NIA) ఐపీఎస్ అధికారిగా పరిచయం చేసుకుని, దంపతులు నిరంతరం తమ పర్యవేక్షణలో ఉన్నారని నమ్మబలికాడు. విచారణ పేరుతో, బాధితులను మూడు రోజుల పాటు వీడియో కాల్‌లోనే ఉండమని బలవంతం చేశారు.
ఇది కూడా చదవండి: PKL 2025-Telugu Titans: ఓడిపోయిన తెలుగు టైటాన్స్.. ఫైనల్ కు వెళ్లే జట్లు ఇవే..!
ఇది వారిని మానసికంగా ఒంటరిని చేసి, నియంత్రించడానికి ఉపయోగించిన పకడ్బందీ పద్ధతి. ఈ విచారణ సమయంలో, దంపతుల బ్యాంకు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకున్నారు. డబ్బును తనిఖీ చేయాలని చెప్పి, బాధితుడిని బెదిరించి రూ. 50.5 లక్షలను తమకిచ్చిన ఖాతాకు బదిలీ చేయించారు. డబ్బు బదిలీ అయిన వెంటనే కాల్స్ ఆగిపోవడంతో, తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు అక్టోబర్ 10న సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నార్త్ రీజియన్ సైబర్ పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి, మోసానికి గురైన సొమ్ములో రూ. 29.5 లక్షలను రవి ఆనంద అంబోర్ అనే వ్యక్తి మొదటి-స్థాయి మ్యూల్ అకౌంట్ కు చేరినట్లు గుర్తించారు. అంబోర్ తన బ్యాంకు ఖాతాను కమిషన్ కోసం సైబర్ నేరగాళ్లకు అద్దెకు ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. అతడి సమాచారం ఆధారంగా, దేశవ్యాప్తంగా కనీసం ఏడు సైబర్ మోసాలలో పాలుపంచుకున్న విశ్వపాల్ చంద్రకాంత్ జాధవ్ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

