Medak: మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండలం, బర్దిపూర్ గ్రామంలో ఒక విషాదకర ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన శ్రీశైలం (40), మంజుల (35) అనే భార్యాభర్తలు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం గ్రామంలో కలకలం రేపింది. ఈ దంపతులు తమ ఇంట్లోనే మరణించి కనిపించడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఈ ఘటన వివరాలు పరిశీలిస్తే… మంజుల మృతదేహం వారు పడుకునే స్థలంలోనే కనిపించింది. ఆమెకు ఏమైందో, ఎలా చనిపోయిందో స్పష్టంగా తెలియరాలేదు. ఇక ఆమె భర్త శ్రీశైలం మాత్రం ఇంట్లో ఉరి వేసుకుని కనిపించాడు. వీరిద్దరూ రాత్రి నిద్రించిన తర్వాత ఈ ఘోరం జరగడంతో, గ్రామస్తులు ఆందోళన చెందారు.
సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, మరణానికి గల కారణాలపై దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ దంపతులు ఎలా చనిపోయారు? ఇది ఆత్మహత్యా? లేదా ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అనే కోణంలో పోలీసులు కూలంకషంగా విచారణ చేస్తున్నారు. పూర్తి నిజాలు తెలియాలంటే పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే. బర్దిపూర్ గ్రామంలో ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని, భయాందోళనను నింపింది.

