Yadagirigutta: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మరో అవినీతి వ్యవహారం కలకలం రేపుతోంది. గతంలో లడ్డూ ప్రసాదం తయారీలో వాడే చింతపండు మాయమైన ఘటన మరువకముందే, ఇప్పుడు సాక్షాత్తు స్వామివారి బంగారు, వెండి డాలర్లు మాయమవడం సంచలనంగా మారింది. సుమారు రూ. 10 లక్షల విలువైన ఈ డాలర్లు గల్లంతైనట్లు ఇటీవల నిర్వహించిన ఆడిట్ తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది.
ఏం జరిగింది?
యాదగిరిగుట్ట ఆలయానికి భక్తులు సమర్పించిన బంగారం, వెండిని ప్రభుత్వ మింట్ కంపౌండ్‌కు పంపి, అక్కడ స్వామివారి ప్రతిమతో కూడిన డాలర్లుగా తయారు చేయిస్తారు. ఈ డాలర్లను ఆలయ ప్రచార శాఖ ఆధ్వర్యంలో భక్తులకు విక్రయిస్తారు. ఇటీవల ఆడిట్ అధికారులు స్టాక్ రిజిస్టర్‌ను, భౌతికంగా ఉన్న డాలర్లను సరిపోల్చగా లెక్కల్లో భారీ తేడాలు కనిపించాయి. సుమారు ఒక ఏడాది క్రితమే ఇవి మాయమైనట్లు అధికారులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Aishwarya: రజినీ బయోపిక్‌పై ఐశ్వర్య క్లారిటీ!
అధికారుల నిర్లక్ష్యం – సిబ్బంది చేతివాటం..
ఈ డాలర్లు నేరుగా ఆలయ ఈవో (EO) పర్యవేక్షణలో ఉండాల్సి ఉండగా, ప్రచార శాఖలోని కొందరు సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టాక్ లెక్కలకు, దగ్గర ఉన్న నాణేలకు పొంతన లేకపోవడంతో సిబ్బంది బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోనే ఎంతో పేరుగాంచిన ఈ క్షేత్రంలో ఇలా వరుసగా అక్రమాలు జరగడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విచారణకు ఆదేశం..
ఈ ఘటనపై ఆలయ డీఈవో దోర్బల భాస్కర్ వివరణ ఇస్తూ.. గల్లంతైన డాలర్ల సొమ్మును త్వరలోనే రికవరీ చేస్తామని, బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే, ఇంత పెద్ద మొత్తంలో విలువైన వస్తువులు మాయమైనా ఆలయ ఉన్నతాధికారులు ఇప్పటి వరకు అధికారికంగా స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. లోతైన విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుతున్నారు.
