Corona Virus: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా కొత్తగా వెలుగులోకి వచ్చిన వేరియంట్లు ఎన్‌బీ.1.8.1 మరియు ఎల్‌ఎఫ్.7లు భవిష్యత్తులో ప్రమాదాన్ని సూచిస్తున్నాయనే భావన కనిపిస్తోంది. మంగళవారం రాత్రి వరకు భారత్‌లో 1,010 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కొత్త వేరియంట్ల చుట్టూ భయం:
ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) ప్రకారం, ప్రస్తుతం భారతదేశంలో ఉన్న వైవిధ్యాలు JN.1 ఉప రకాలుగా కనిపిస్తున్నాయి. అయితే, ఈ వేరియంట్లు ఇంతవరకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలిగించాయని ఆధారాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
వైరస్ వ్యాప్తికి కారకాలు:
కరోనా వ్యాప్తి మళ్లీ ప్రారంభం కావడానికి పలు కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో వైరస్ సోకినవారిలోనూ, టీకాలు వేసుకున్న వారిలోనూ ఇమ్యూనిటీ తగ్గిపోవడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. వృద్ధులు మరియు దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారు మళ్లీ వైరస్ బారినపడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: TDP Mahanadu: నేడు మూడోరోజు టీడీపీ మహానాడు.. 5 లక్షల మందితో బహిరంగ సభ!
వాతావరణ పరిస్థితులు కూడా కరోనా వ్యాప్తికి దోహదపడుతున్నాయని అంటున్నారు. చల్లని వాతావరణం, గాలిలో తేమ శాతం పెరగడం వల్ల ఇతర శ్వాసకోశ వ్యాధుల్లాగే కరోనా కూడా వేగంగా వ్యాప్తి చెందుతోందని అంటున్నారు. ముఖ్యంగా రుతుపవనాల వల్ల తేమ ఎక్కువగా ఉండటం కూడా వైరస్ పునరాగమనానికి దోహదపడుతోంది.
టెస్టింగ్ తగ్గటం ప్రమాదకరం:
కొవిడ్‌ను ఎండమిక్‌గా ప్రకటించిన తర్వాత టెస్టింగ్, జెనొమిక్ సర్వెయిలెన్స్ తగ్గిపోయిన నేపథ్యంలో, వైరస్ మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తోందని నిపుణుల అంచనా. వైరస్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు పరీక్షలు పెంచాల్సిన అవసరం ఉందని ఆరోగ్య శాఖ సూచిస్తోంది.
రాష్ట్రాల పరిస్థితేంటి?
ప్రస్తుతం దేశంలో నమోదైన యాక్టివ్ కేసుల్లో 43% కేసులు కేరళలో ఉన్నట్లు అధికారిక సమాచారం. మహారాష్ట్రలో 21%, ఢిల్లీలో 10%, గుజరాత్‌లో 8%, తమిళనాడులో 7% కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. సింగపూర్, ఇతర ఆగ్నేయాసియా దేశాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది.
కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎలాంటి ఆందోళనకర పరిస్థితి లేదని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నామని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రజలకు సూచనలు:
-
రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించండి
-
చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవడం అలవర్చుకోండి
-
కొవిడ్ లక్షణాలు కన్పిస్తే స్వీయ నిర్బంధంలోకి వెళ్లండి
-
వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు పాటించాలి.