Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోమవారం రాత్రి ప్రత్యేక విమానంలో కడపకు వెళ్ళారు. అక్కడి విజయదుర్గా దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్శించుకున్నారు. ఆ తర్వాత పెద్ద దర్గాలో జరుగుతున్న ఉరుసు ఉత్సవాలలో పాల్గొన్నారు. ఎ.ఆర్. రెహమాన్ కు ఇచ్చిన మాటకు కట్టుబడి తాను అయ్యప్ప మాలలో ఉన్నా… ఈ దర్గాకు వచ్చానని రామ్ చరణ్ తెలిపారు. గతంలో ‘మగధీర’ సినిమా విడుదలకు ముందు ఇక్కడకు వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే అయ్యప్ప మాల వేసుకుని దర్గాను సందర్శించడానిని కొంతమంది అయ్యప్పలు తప్పుపడుతున్నారు. దర్గా అనేది ముస్లింల సమాధి అని, అక్కడకు వెళ్ళి రామ్ చరణ్ తప్పు చేశారని అంటున్నారు. మరికొందరు… శబరిమల వెళ్ళే భక్తులు పంపానది తీరంలోని వావర్ స్వామి అనే ముస్లిం భక్తుడి సమాధిని సందర్శించుకుంటారని, అక్కడ లేని అభ్యంతరం ఇక్కడ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. జనవరి 10న ‘గేమ్ ఛేంజర్’ విడుదల కాబోతున్న నేపథ్యంలో చెర్రీ చేసిన కడప దర్గా సందర్శన కొత్త వివాదలకు తెరలేపినట్టు అయ్యింది.
