Congress Party:ఎన్నాళ్ల నుంచో ఊరిస్తూ వస్తున్న మంత్రివర్గ విస్తరణ అంశం ఆ పార్టీ నేతల్లో అసహనానికి దారితీస్తున్నది. శృతిమించి రాగాన పడుతున్నది. ఇది ఎందాక దారితీస్తున్నదోనన్న ఆందోళన ఆ పార్టీ అధిష్టానంలో నెలకొని ఏకంగా విస్తరణ అంశాన్నే పక్కన పెట్టేసింది. దీంతో ఆ పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తి ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్నది. దీంతో ప్రజల్లో పార్టీపై వ్యతిరేక ప్రభావం తీసుకొస్తుందన్న భావన ఏర్పడింది. దీంతో ఆ అసమ్మతి గళాలకు ఈ రోజు (ఏప్రిల్ 15) జరిగే సీఎల్పీ సమావేశంలో చెక్ పెట్టేందుకు చొరవ తీసుకుంటారని భావిస్తున్నారు.
Congress Party:సీఎల్పీ సమావేశంలో ముఖ్యంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించే విషయం అని చెప్తున్నా, ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ అంశంపై ఒక్కొక్కరుగా వినిపిస్తున్న అసమ్మతి గళాలపైనే చర్చిస్తారని సమాచారం. వారిని కట్టడి చేయకపోతే మరింత ముదిరి పాకాన పడే ప్రమాదంలో పడే అవకాశం ఉన్నదని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు.
Congress Party:శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సీఎల్పీ భేటీ జరగనున్నది. ఈ భేటీకి మంత్రులు, విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరవనున్నారు. ఈ సందర్భంగా ఇతర అంశాల కన్నా మంత్రివర్గ విస్తరణ అంశంపై కొందరి బహిరంగ వ్యాఖ్యలపైనే చర్చిస్తారని అనుకుంటున్నారు. మరోసారి బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా కట్టడి చేయాలన్నది వారి భావన.
Congress Party:మంత్రివర్గ విస్తరణ విషయంలో తనకు మంత్రిపదవి రాకుండా సీనియర్ నేత జానారెడ్డి అడ్డుకున్నారంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారాన్ని లేపాయి. అదే విధంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుటుంబంపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు చేసిన వ్యాఖ్యలు, తనకు మంత్రి పదవి దక్కకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న ఆయన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
Congress Party:హెలికాప్టర్ లేకుండా నల్లగొండ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బయట అడుగు పెడ్తలేరని ఏకంగా మరో మంత్రి అయిన దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించడం అలజడి రేపింది. మంత్రిపదవి తనకు దక్కకపోతే తాను రాజీనామా చేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడం కూడా పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. వీటితోపాటు ప్రత్యారోపణలు కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇవన్నింటిపై ఈ సీఎల్పీ సమావేశంలో చర్చిస్తారని, అసమ్మతి గళాలను కట్టడి చేస్తారని భావిస్తున్నారు.

