Congress Party: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కుంపటి రాజుకుంటూనే ఉన్నది. మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిపై ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్యన వైరం రాజుకుంటూనే ఉన్నది. ఇటీవలే టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఏదుట హాజరైన కొండా మురళి వివరణ ఇచ్చారు. అనంతరం కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన ఎమ్మెల్యేలు కూడా కొండాపై చర్యలకు డిమాండ్ చేశారు. దీంతో వైరివర్గాల నడుమ వైరం ఆరని మంటలుగా రాజుకుంటూనే ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Congress Party: తాజాగా కొండా దంపతులపై వ్యతిరేకంగా జట్టుకట్టిన నేతలు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. తాము ఫిర్యాదు చేస్తే తమనే పిలువడమేమిటని వారంతా ప్రశ్నించినట్టు తెలిసింది. వారిలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ వెంకటరమణారెడ్డి ఉన్నారు. ముఖ్యంగా తమ నియోజకవర్గాల్లో కొండా దంపతుల ఆధిపత్యమేమిటని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది.
Congress Party: గతంలో కాంగ్రెస్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన కొండా దంపతులు కొందరు ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు చేశారు. పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యేలు అసలైన కాంగ్రెస్ నేతలకు అన్యాయం చేస్తున్నారని, వారి వల్ల పార్టీ ప్రమాదంలో పడుతుందని పార్టీకి ఫిర్యాదులు చేశారు. ఓ దశలో కొండా మురళి బహిరంగంగానే తన వ్యతిరేకతను మాటల రూపంలో బయటపెట్టుకున్నారు.
Congress Party: ఈ నేపథ్యంలో వరంగల్ కాంగ్రెస్ కుంపటి ఇప్పట్లో చల్లారేలా లేనట్టుగా తెలుస్తున్నది. దీంతో ఇటు రాష్ట్ర నాయకత్వం, అటు పార్టీ అధిష్ఠానం తలలు పట్టుకుంటున్నది. తమపై బహిరంగంగా విమర్శలు గుప్పించడమే కాకుండా, తమ నియోజకవర్గాల్లో కొండా దంపతుల ఆధిపత్యం పెరుగుతుందని వారి ప్రత్యర్థులు పార్టీకి ఫిర్యాదులు చేశారు.
Congress Party: తాము పార్టీలు మారిన మాట వాస్తవమేనని, కానీ, కొండా దంపతుల మాదిరిగా తాము అన్ని పార్టీలూ మారలేదని గుర్తు చేస్తున్నారు. చివరగా కొండా మురళిపై చర్యలు తీసుకోకుంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని కూడా ప్రత్యర్థి వర్గం పార్టీ నాయకత్వానికి సూచించింది. ఈ లోగానే ఏదైనా నిర్ణయం తీసుకోవాలని కోరింది. దీంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.