Sanchar Saathi: దేశంలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలకు, మొబైల్ ఫోన్ల దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. దేశంలో విక్రయించే ప్రతి కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ‘సంచార్ సాథీ’ (Sanchar Sathi) అనే ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ యాప్‌ను ఇకపై తప్పనిసరిగా, తొలగించలేని విధంగా ఇన్‌బిల్ట్‌గా ఇన్‌స్టాల్ చేయాలని టెలికం శాఖ (DoT) జారీ చేసిన ఆదేశాలపై ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది.
గోప్యత హక్కు ఉల్లంఘనపై కాంగ్రెస్ అడ్జర్న్‌మెంట్ మోషన్
కేంద్రం ఆదేశాల ప్రకారం, మొబైల్ తయారీ సంస్థలు, దిగుమతిదారులు ఈ యాప్‌ను డిఫాల్ట్‌గా అందించాల్సి ఉంటుంది. ఈ చర్య పౌరుల గోప్యతా హక్కును ఉల్లంఘిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంటులో అడ్జర్న్‌మెంట్ మోషన్ దాఖలు చేశారు.
రేణుకా చౌదరి మాట్లాడుతూ, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద హామీ ఇచ్చిన గోప్యత హక్కుకు ఇది పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. సరైన రక్షణ చర్యలు, పార్లమెంటరీ పర్యవేక్షణ లేకుండా ఈ నిబంధన అమలు చేస్తే, పౌరుల కదలికలు, సంభాషణలు, వ్యక్తిగత నిర్ణయాలు అన్నీ నిరంతరం పర్యవేక్షించబడే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల దేశ పౌరులందరిపైనా ‘నిరంతర నిఘా’ ఏర్పడుతుందని విమర్శించారు. ఈ సున్నిత అంశంపై సభలో తక్షణమే చర్చ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Siddaramaiah: అధిష్ఠానం ఎప్పుడు ఆదేశిస్తే డీకే అప్పుడు సీఎం అవుతారు
సంచార్ సాథీ: భద్రత కోసమే కేంద్రం అడుగు
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సైబర్ నేరాలను నియంత్రించే లక్ష్యంతోనే తీసుకుంది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన ‘సంచార్ సాథీ’ పోర్టల్/యాప్ ద్వారా:
పోగొట్టుకున్న/దొంగిలించబడిన ఫోన్లను సులభంగా ట్రాక్ చేసి బ్లాక్ చేయవచ్చు. ఇప్పటివరకు ఈ యాప్ సహాయంతో సుమారు 7 లక్షల చోరీ ఫోన్‌లను గుర్తించి బ్లాక్ చేయడం జరిగింది. వినియోగదారులను సైబర్ దాడుల నుంచి హెచ్చరించడం, అనధికారిక యాక్సెస్‌ను నిరోధించడం దీని ముఖ్య లక్ష్యాలు. ఈ యాప్‌తో సైబర్ నేరాలు 20 నుంచి 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కేంద్ర టెలికామ్ మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం, 2025 డిసెంబర్ 1 నుంచి తయారయ్యే అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఈ యాప్‌ను డిఫాల్ట్‌గా అందించాల్సి ఉంటుంది. ఇప్పటికే మార్కెట్‌లోకి వచ్చిన ఫోన్లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా దీన్ని ఇన్‌స్టాల్ చేయాలని సూచించారు.
టెక్ దిగ్గజాల స్పందన కీలకం
ప్రభుత్వ నిర్ణయంపై యాపిల్, శాంసంగ్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా యాపిల్ వంటి సంస్థలు తమ ఆపరేటింగ్ సిస్టమ్‌లో థర్డ్-పార్టీ యాప్‌లను డిఫాల్ట్‌గా, తొలగించలేని విధంగా చేర్చడానికి సాధారణంగా సుముఖత చూపవు. గతంలో కూడా ఇలాంటి ప్రతిపాదనలను వ్యతిరేకించిన దాఖలాలు ఉన్నాయి.

