Congress: కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. గ్యాంగ్‌టక్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
అరెస్ట్‌కు ముందు దేశవ్యాప్తంగా వీరేంద్రకు సంబంధించిన 30 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించగా, భారీ మొత్తంలో ఆస్తులు బయటపడ్డాయి. సోదాల సమయంలో రూ.12 కోట్లు నగదు, రూ.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసినట్లు అధికారులు తెలిపారు. వీటిలో కోటిరూపాయల విలువైన విదేశీ కరెన్సీ కూడా ఉంది. అదనంగా, నాలుగు ఖరీదైన వాహనాలు సీజ్ చేసి, 17 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి, రెండు బ్యాంక్ లాకర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈడీ ప్రాథమిక దర్యాప్తులో, ఈ బెట్టింగ్ రాకెట్ కార్యకలాపాలు దుబాయ్ కేంద్రంగా సాగుతున్నాయి అని తేలింది. వీరేంద్ర సోదరుడు కేసీ తిప్పేస్వామి, కుమారుడు పృథ్వీ ఎన్ రాజ్ దుబాయ్ నుంచే ఆన్‌లైన్ గేమింగ్ వ్యవహారాలను నడుపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. వీరు కింగ్567, రాజా567, రత్న గేమింగ్ వంటి వెబ్‌సైట్ల ద్వారా బెట్టింగ్ వ్యాపారం జరుపుతున్నట్లు ఈడీ పేర్కొంది.
గోవాలోని పప్పీస్ కాసినో గోల్డ్, ఓషన్ 7 కాసినో, బిగ్ డాడీ కాసినోలపై కూడా ఈడీ దాడులు చేసింది. అలాగే, గ్యాంగ్‌టక్‌లో ఒక క్యాసినో ఏర్పాటు కోసం వీరేంద్ర భూమి లీజుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం అందింది.
నిందితుడిని గ్యాంగ్‌టక్‌లోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి కస్టడీ కోరనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో పెద్ద మొత్తంలో నిధుల అక్రమ బదిలీకి సంబంధించిన ఆధారాలు లభించాయని ఈడీ పేర్కది.