Rohit Sharma

Rohit Sharma: రోహిత్ శర్మపై కాంగ్రెస్‌ నేత బాడీషేమింగ్‌.. భాజపా ఫైర్

Rohit Sharma: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్‌కు చెందిన ఓ మహిళా నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో, కాంగ్రెస్ అధికార ప్రతినిధి శమా మహమ్మద్ ‘ఎక్స్’లో ఓ పోస్ట్ చేశారు. ఆమె వ్యాఖ్యల్లో రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేస్తూ, అతను ఫిట్‌గా లేడని, బరువు తగ్గాలని సూచించారు. అంతేకాక, గత కెప్టెన్లతో పోలిస్తే అతడు ఆకట్టుకునే నాయకత్వం కనబరచడం లేదని విమర్శించారు.

ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో భారతీయ జనతా పార్టీ (BJP) ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. భాజపా అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి ఈ వ్యాఖ్యలను ‘సిగ్గుచేటు’గా పేర్కొంటూ, ‘‘భారత క్రికెట్ కెప్టెన్‌ను కూడా కాంగ్రెస్ వదిలిపెట్టట్లేదు. రాహుల్ గాంధీని క్రికెట్ ఆడించాలని వారు కోరుకుంటున్నారా?’’ అంటూ ఎద్దేవా చేశారు. మరో భాజపా నేత షెహ్‌జాద్ పూనావాలా మాట్లాడుతూ, ‘‘కాంగ్రెస్ పార్టీ కేవలం క్రీడాకారులనే కాదు, భారతదేశపు సాయుధ దళాలను కూడా ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటుంది. ఇది ప్రేమ దుకాణం కాదు, విద్వేష కేంద్రం,’’ అని వ్యాఖ్యానించారు.

Also Read: Champions Trophy 2025: తన ఖాతాలో మరో రికార్డు వేసుకున్న విరాట్ కోహ్లీ

Rohit Sharma: కాంగ్రెస్ నేత శమా మహమ్మద్ తన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ‘‘నేను రోహిత్ శర్మను గత కెప్టెన్లతో పోలుస్తూ సామాన్యంగా మాట్లాడాను. ప్రజాస్వామ్యంలో మాకు అభిప్రాయ స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందా?’’ అని ప్రశ్నించారు. అయితే, ఈ వివాదం ముదరడంతో కాంగ్రెస్ పార్టీ ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా, ‘‘ఈ వ్యాఖ్యలు పార్టీ విధానాన్ని ప్రతిబింబించవు. దేశ క్రికెటర్లను మేము గౌరవిస్తాం. ఆమె చేసిన వ్యాఖ్యలను తొలగించాలని కోరాం. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించాం,’’ అని ‘ఎక్స్’లో తెలిపారు.

ఈ వివాదం సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు కూడా శమా మహమ్మద్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *