Harish Rao: బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్రావు తెలంగాణ రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన నివాసంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన, వచ్చే రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల కంటే ఎక్కువ కాలం కొనసాగదు హరీష్రావు స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ వస్తుందని, ప్రస్తుతం పార్టీ కార్యకర్తలను లేదా ప్రజలను ఎవరైనా ఇబ్బంది పెడితే వారి పేర్లను డైరీలో రాసి పెట్టుకోవాలని సూచించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా సమాధానం చెబుతామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చాటిచెప్పాయని, అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం భయపడుతోందని ఆయన విమర్శించారు.
Also Read: Chandrababu Naidu: ప్రజల వద్దకే పాలన.. వేగంగా సేవలు అందించడమే లక్ష్యం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై హరీష్రావు ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలతో సతమతమవుతుంటే, ముఖ్యమంత్రికి మాత్రం ఫుట్బాల్ మ్యాచ్లుపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, చివరకు బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు సగం మందికి కూడా చీరలు పంపిణీ చేయలేకపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, త్వరలోనే ప్రజలే ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని హరీష్రావు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
