Mangalagiri: మంగళగిరి టౌన్ లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా సహకారంతో జరుగుతున్న మంగళగిరి కబడ్డీ లీగ్ పోటీలు శనివారం రాత్రితో విజయవంతంగా ముగిశాయి. మంగళగిరి బీఎండబ్యూ షోరూమ్ పక్కన గల మైదానంలో గత నాలుగు రోజులుగా ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పురుషులు, మహిళల కబడ్డీ పోటీలు ఆద్యంతం ఉత్కంఠ భరితంగా జరిగాయి. మొదటి రోజు నుంచి క్రీడాకారులు తమ ఆట తీరుతో, నైపుణ్యంతో క్రీడాప్రేమికులను అలరించారు. ఉమ్మడి 13 జిల్లాల నుంచి 336 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు.
నాలుగో రోజు ముందుగా సెమీ ఫైనాల్స్ నిర్వహించిన అనంతరం ఫైనల్స్ నిర్వహించారు. ముందుగా నాయకులు క్రీడాకారులను పరిచయం చేసుకోని ఫైనల్ పోటీలను ప్రారంభించారు. పోటీలను తిలకించడానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. గెలుపొందిన విజేతలకు లైట్లు తీసేసి సెల్ ఫోన్ లైట్లతో వీక్షకులు అభినందనలు తెలిపారు.
పురుషుల విభాగం ఫైనల్ మ్యాచ్‌లో కృష్ణా జట్టుపై తూర్పుగోదావరి జట్టు 15-18 తేడాతో గెలుపొందింది. ద్వితీయ స్థానంను కృష్ణా, తృతీయ స్థానంను గుంటూరు జట్లు కైవసం చేసుకున్నాయి. మహిళా విభాగం ఫైనల్ మ్యాచ్‌లో కృష్ణా జట్టుపై విజయనగరం జట్టు 8-31 తేడాతో గెలుపొందింది. ద్వితీయ స్థానంను కృష్ణా, తృతీయ స్థానంను చిత్తూరు జట్లు కైవసం చేసుకున్నాయి. మహిళా, పురుషుల విభాగాలలో కూడా కృష్ణా జిల్లా ద్వితీయ స్థానం కైవసం చేసుకుంది. గెలుపొందిన విజేతలకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ట్రోఫీలు, నగదు బహుమతులు ప్రధానం చేశారు.

