KTR: జూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ (KTR) ఎన్నికల ప్రచారం తీరుపై ఓటరు షఫీవుద్దీన్ రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
మైనర్లతో ప్రచారంపై ప్రధాన ఫిర్యాదు
ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మైనర్లను ఉపయోగించారని ఓటరు షఫీవుద్దీన్ తన ఫిర్యాదులో ఆరోపించారు.రాజకీయ లాభం కోసం, ప్రజల్లో సానుభూతి రేకెత్తించాలనే ఉద్దేశ్యంతోనే కేటీఆర్ మైనర్లతో ప్రచారం చేయిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంటూ, కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మరియు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Chutney Murder: నా మీదే చట్నీ వేస్తావా.. వ్యక్తిని కిరాతకంగా చంపేసిన యువకులు
కాంగ్రెస్ నేతల ఆరోపణలు
ఈ వివాదంపై కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కేటీఆర్ చేసిన మరికొన్ని వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. “‘ఓటుకు రూ.5 వేలు తీసుకోండి, భారత రాష్ట్ర సమితికి ఓటేయండి’ అంటూ కేటీఆర్ మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉన్నాయి. ఎన్నికల సంఘం (ఈసీ) తక్షణమే స్పందించి ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేయాలి” అని ఆయన కోరారు.
మరోవైపు, కాంగ్రెస్ నేతలు పెద్ద కుట్రకు తెరలేపారని కేటీఆర్ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఫిర్యాదుపై ఎన్నికల అధికారులు ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

