Vidadala Rajini: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన డిజిటల్ బుక్ యాప్‌లోనే మాజీ మంత్రి విడదల రజినిపై ఫిర్యాదు నమోదవడం సెన్సేషన్‌గా మారింది.
రజినిపై రావు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు
నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఈ యాప్ ద్వారా రజినిపై ఫిర్యాదు చేశారు. ఆయన ఆరోపణల ప్రకారం, 2022లో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉన్న తన పార్టీ కార్యాలయం, ఇల్లు, కారు పైన విడదల రజిని దాడి చేయించారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని జగన్‌ను ఆయన కోరారు.
చిలకలూరిపేటలో రజినే ఆవిష్కరించిన యాప్‌లోనే ఫిర్యాదు
ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ డిజిటల్ బుక్ యాప్‌ను చిలకలూరిపేటలోనే తన నివాసం వద్ద, పార్టీ కార్యకర్తల సమక్షంలో విడదల రజినే ఆవిష్కరించారు. అయితే యాప్ ప్రారంభించిన కొద్ది సేపటికే ఆమె పేరుతో ఈ ఫిర్యాదు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణ పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త
జగన్ స్పందనపై ఉత్కంఠ
ఈ పరిణామంపై రజిని ఇంకా స్పందించకపోయినా, జగన్ వైపు నుంచి ఏ విధమైన చర్యలు తీసుకుంటారా? అన్న ప్రశ్న రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ కార్యకర్తల కోసం, వారికి అన్యాయం జరిగితే రక్షణ కల్పించేందుకు శ్రీరామరక్షలా ఈ యాప్ ఉపయోగపడుతుందని జగన్ పేర్కొన్నారు. ఇప్పుడు అదే యాప్‌లో మాజీ మంత్రిపై ఫిర్యాదు రావడం ఆయనకు సవాలుగా మారింది.
డిజిటల్ బుక్‌తో జగన్ హామీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్, “కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఈ యాప్‌లో నమోదు చేస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక బృందాలతో న్యాయం చేస్తాం. తప్పు చేసిన వారిని ఎవరైనా కావొచ్చు, చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తాం” అని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Actress Fiance Sucide: నటికి కాబోయే భర్త ఆత్మహత్య
రాజకీయాల్లో ఊహించని మలుపు
తన సొంత పార్టీ మాజీ మంత్రిపైనే ఫిర్యాదు రావడంతో జగన్‌కు ఇది ఊహించని షాక్‌గా మారింది. ఇకపై డిజిటల్ బుక్ ద్వారా మరెంతమంది నేతలపై ఫిర్యాదులు వెలువడతాయో, వాటిపై పార్టీ అధినేత జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
మొత్తం మీద, వైసీపీ డిజిటల్ బుక్ యాప్ ఆవిష్కరణ తర్వాతే విడదల రజినిపై వచ్చిన ఈ ఫిర్యాదు, ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చలకు తెరలేపింది.