AP Farmers: ఆంధ్రప్రదేశ్ రైతులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న పంటలకు రూ.280.92 కోట్ల పెట్టుబడి సాయాన్ని ఈరోజు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ మొత్తాన్ని విడుదల చేస్తారు. వర్షాలు, వరదలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.17 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింది. మొత్తంగా 1.87 లక్షల మంది రైతులు నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు. వీరందరికీ చారిత్రాత్మక స్థాయిలో పరిహారాన్ని ఈరోజు ముఖ్యమంత్రి వారి ఖాతాల్లోకి జమ చేస్తారు.
AP Farmers: రైతులతో పాటు వర్షలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులకు కూడా ఈరోజు పరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ పరిహారాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాలకు జమ చేయబోతున్నారు. విజయవాడ కలెక్టరేట్ లో ఈరోజు ఈ మేరకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈనెల మొదటి వారంలో కురిసిన వానలకు బుడమేరుకు గండి పడి విజయవాడలోని పలు ప్రాంతాలు జలమయం అయిన సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్రంలోని 16 జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వర్షాలు, వరదల్లో నష్టపోయిన బాధితులకు సంబంధించిన అన్ని వివరాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. పరిహారం చెల్లించాల్సిన బాధితులకు సంబంధించి ఎన్యుమరేషన్ పూర్తి అయింది. పరిహారానికి సంబంధించిన ప్యాకేజీని సీఎం ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు ఆ డబ్బులు నేరుగా బాధితుల ఖాతాలకు జమ చేస్తున్నారు.