Telangana Colleges Bandh: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో తెలంగాణలోని వృత్తి విద్యా కళాశాలలు ఈ నెల 15వ తేదీ నుంచి బంద్‌కు పిలుపునిచ్చాయి. దీనిపై ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య (FATHI) కార్యవర్గం అత్యవసర సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకుంది.
డిమాండ్ ఇదే..
రాష్ట్ర ప్రభుత్వం తమకు సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని కళాశాల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ బకాయిలు వెంటనే చెల్లించకపోతే కళాశాలల నిర్వహణ కష్టం అవుతుందని, విద్యా రంగం తీవ్రంగా దెబ్బతింటుందని సమాఖ్య నాయకులు తెలిపారు. ఈ సమస్యపై ఇప్పటికే ఉన్నత విద్యా మండలి చైర్మన్‌కు మెమోరాండం సమర్పించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బంద్‌కు సిద్ధమయ్యారు.
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన
ఈ బంద్ కారణంగా విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఎడ్, ఎంబీఏ, ఎంసీఏ, లా, నర్సింగ్ వంటి కళాశాలలు ఈ బంద్‌లో పాల్గొననున్నాయి.